నాలుగు రోజులుగా కట్టు బట్టలతోనే.. | - | Sakshi
Sakshi News home page

నాలుగు రోజులుగా కట్టు బట్టలతోనే..

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

మక్కా వెళ్లిన ముస్లిం సోదరుల ఇబ్బందులు 18, 19 తేదీల్లో గన్నవరం విమానాశ్రయం నుంచి మక్కా వెళ్లిన 288 మంది వారి లగేజీ ఇక్కడే ఉండిపోవడంతో అక్కడ అవస్థలు రోడ్డుమార్గాన కోల్‌కతా పంపిన అధికారులు

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి మక్కా యాత్రకు వెళ్లిన హాజీలు అక్కడ కట్టుబట్టలతో నానా ఇబ్బందులు పడుతున్నారు. వారు నాలుగు రోజుల కిందట మక్కా చేరినా వారి లగేజీ ఇంకా ఇక్కడే ఉండటంతో అక్కడ వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో 288 మంది ముస్లిం సోదరులను మక్కా పంపించింది. ఇందుకోసం మైనార్టీశాఖ మంత్రి, వివిధ మైనార్టీ విభాగాల నాయకులు గన్నవరంలో నాలుగు రోజులు పాటు నానా హడావుడి చేశారు. హాజీలతో పాటు వెళ్లాల్సిన వారి లగేజీ మాత్రం ఇక్కడే ఉండిపోయింది. లగేజీ రాక ఇబ్బందులు పడుతున్న హాజీలు ఫోన్‌చేసినా అధికారులు తలో సమాధానం ఇచ్చారు. దీంతో ఇక్కడి వారి కుటుంబసభ్యులు అధికారులను నిలదీస్తే లగేజీ గన్నవరంలోనే ఉండిపోయిందని తెలిసింది. హజ్‌ కమిటీకి, అధికారులకు మధ్య సమన్వయలోపం వల్లే లగేజీ నాలుగు రోజులైనా మక్కాకు చేరుకోలేదని హాజీల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మక్కాలో వారికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కోల్‌కతా నుంచి నేడు విమానంలో తరలింపు

హాజీలను తీసుకెళ్లిన విమానయాన సంస్థకు గన్నవరం నుంచి గానీ, చైన్నె, బెంగళూరుల నుంచి గానీ కనెక్టింగ్‌ విమానం లేకపోవడం వల్లే లగేజీ వెళ్లలేదని తెలిసింది. కోల్‌కతా నుంచి తమ విమానంలో లగేజీ పంపుతామని ఆ సంస్థ ప్రతినిధులు అధికారులకు చెప్పడంతో లగేజీని గన్నవరం నుంచి మంగళవారం రాత్రి రోడ్డుమార్గాన కోల్‌కతాకు పంపించారు. బుధవారం రాత్రి కోల్‌కతా చేరుకునే ఈ లగేజీని గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడి నుంచి విమానంలో మక్కా పంపించనున్నారు. మక్కా యాత్రకు సంబంధించి ఈ నెల 18, 19 తేదీల్లో సభ నిర్వహించి హడావుడి చేసిన కూటమి నేతలు హాజీల లగేజీ విషయాన్ని మాత్రం పట్టించుకోకపోవడం విమర్శనీయంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వతీరుపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement