బాలుడి కిడ్నాప్‌ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్‌ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

కోనేరుసెంటర్‌: పిల్లలను కిడ్నాప్‌ చేస్తున్న ముఠాలో మరో ముగ్గురిని కృష్ణాజిల్లా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గతంలో కిడ్నాప్‌కు గురైన మరో బాలుడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ, అయ్యప్పనగర్‌కు చెందిన గండికోట గురమ్మ రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరి ముగ్గురితో పాటు మరో ఆటో డ్రైవర్‌ విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన కొమిర కాళి కలిసి ఈజీ మనీకి అలవాటుపడి నేరాలకు పాల్పడటం ప్రారంభించారు. అందుకోసం పిల్లలను కిడ్నాప్‌ చేసే పనికి పూనుకున్నారు. బిక్షాటన చేసే మహిళలు, అతి పేద కుటుంబాలకు చెందిన వలస కూలీలను టార్గెట్‌గా చేసుకుని వారి వద్ద ఏడాదిలోపు పిల్లలు ఉంటే మహిళలకు మాయమాటలు చెప్పి పిల్లలను కిడ్నాప్‌ చేసి ఇతరులకు ఆ పిల్లలను అమ్ముకోవటం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజుల క్రితం మాదాసు సుమమ్మ అనే బిక్షాటన చేసుకునే మహిళ చేతిలో పది నెలల పిల్లాడు ఉండటాన్ని గమనించిన నలుగురు కలిసి ఆమెకు పాత దుస్తులు ఇస్తామంటూ నమ్మించి ఆటోలో ఎక్కించుకుని కంకిపాడు సమీపానికి చేరుకున్న సమయంలో సుమమ్మను ఆటోలో నుంచి దింపేసి పిల్లాడిని కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లిపోయారు. జరిగిన కిడ్నాప్‌కు సంబంధించి సుమమ్మ అదే రోజు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కిడ్నాప్‌ జరిగిన 24 గంటల వ్యవధిలో ఆటోడ్రైవర్‌ కావలి కాళిని అదుపులోకి తీసుకోవటంతో పాటు బాలుడి ఆచూకీ కనుగొన్నారు.

మరో బాలుడి ఆచూకీ లభ్యం..

పిల్లలను కిడ్నాప్‌ ముఠాను పట్టుకున్న పోలీసులు నిందితులను విచారించగా మరో ఆసక్తికరమైన ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ఇదే ముఠా గత నెలలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సంచరిస్తున్న బిహార్‌కు చెందిన మరో మహిళ చేతిలో ఉన్న బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు పథకం పన్నారు. ఆమెకు మాయమాటలు చెప్పి భోజనం పెట్టిస్తామంటూ నమ్మించి ఆటోలో తీసుకువెళ్లారు. ఆమెను గుర్తు తెలియని ప్రదేశంలో దింపి బాలుడిని కిడ్నాప్‌ చేసి వేరే దంపతులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నిందితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ బాలుడిని కిడ్నాపర్‌ల నుంచి కొనుగోలు చేసిన దంపతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నేరస్తులైన గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ, గండికోట గురమ్మలను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 80,500 స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. సమావేశంలో ఏఆర్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ బి.సత్యనారాయణ, స్పెషల్‌బ్రాంచ్‌ సీఐ సత్యకిషోర్‌, పెనమలూరు సీఐ వెంకటరమణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

కిడ్నాపర్ల నుంచి మరో బాలుడిని

స్వాధీనం చేసుకున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement