పెనమలూరు: ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ బాడీ బిల్డింగ్ పోటీలకు జడ్జిగా ఉమ్మడి కృష్ణాజిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 23, 24 తేదీలలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్– 2026 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు జడ్జిగా అశోక్‌ను ఎంపిక చేశామని టీఏబీబీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు వెల్లడించారు.
గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి(మచిలీపట్నం): గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉయ్యూరు నిర్వహిస్తున్న గిరిజన గురుకుల పాఠశాలలో వివిధ తరగతుల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ జిల్లా అధికారి ఎం ఫణిదూర్జటి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి నూతన, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాట్టు చెప్పారు. మూడో తరగతిలో 40, నాల్గవ తరగతిలో 40, ఐదో తరగతిలో 40, ఆరో తరగతిలో 40 సీట్లు ఉండగా ఏడో తరగతిలో 24, ఎనిమిదో తరగతిలో 27, తొమ్మిదో తరగతిలో 20 సీట్లు బ్యాక్‌లాగ్ ప్రవేశాలు ఉన్నాయని వివరించారు. నూతన ప్రవేశాలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ప్రవేశాలు లాటరీ పద్దతిలో కమిటీలో ఆధ్వర్యంలో జరుగుతాయని, మరిన్ని వివరాలకు 9908839476, 9391601861 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
అరటి కాయల లోడు లారీ బోల్తా
గన్నవరం: జాతీయ రహదారి పక్కన లారీ బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు గాయపడిన సంఘటన గన్నవరం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... అరటికాయల లోడుతో లారీ జార్ఖండ్ నుంచి జంషెడ్‌పూర్‌కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున లారీ స్థానిక శ్రీనివాస హేచరీస్ సమీపంలోని లారీ కాటా వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి లారీలో ఇరుక్కుపోయిన నలుగురి ని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు స్పల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.


