వృద్ధి చెందుతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కృష్ణా జిల్లాలో గత ఏడాది 60,838 గుడ్ల సేకరణ ఈ సంవత్సరం మరో 76,475 గుడ్ల సేకరణ జిల్లాలో మరో రెండు చోట్ల తాబేలు హేచరీల ఏర్పాటు మే వరకు సముద్రంలోకి ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల విడుదల
వీటి నుంచే ఈ జాతికి ప్రమాదం..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అంతరించిపోతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల జాతి సరికొత్తగా ఊపిరి పోసుకుంటోంది. అటవీశాఖ, అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఫలించి ఈ జాతి వృద్ధిబాట పట్టింది. ఈ జాతి తాబేళ్లు పెట్టిన గుడ్లను సేకరించి, హేచరీల్లో పిల్లలను చేయించి వాటిని తిరిగి సముద్రంలోకి వదులుతూ ఆ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. అవనిగడ్డ డివిజన్లో ఐదు చోట్ల హేచరీలను ఏర్పాటు చేసి ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సంరక్షిస్తుండగా, ఈ సంవత్సరం మచిలీపట్నం డివిజన్లో మరో రెండుచోట్ల హేచరీలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలనిస్తోంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, నెల్లూరు, కావలి, బాపట్ల ప్రాంతాల్లో సైతం ఈ జాతి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో నాలుగు లక్షల గుడ్లు సేకరించి పిల్లలను సముద్రంలోకి వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
జన్మించిన చోటకే వచ్చి గుడ్లు పెట్టే తాబేలు
లెపిడోచెలిస్ ఒలివాసియా అనే సాంకేతిక నామంతో పిలిచే అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అట్లాంటిక్, ఫసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. ఈ జాతి మన దేశంలో బంగాళా ఖాతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంది. ఆడ తాబేలు జన్మించిన తరువాత ఎక్కడ నుంచి సముద్రంలోకి వెళ్తుందో అక్కడ నుంచి 9 వేల కిలో మీటర్లు ప్రయాణించి తిరిగి అదే ప్రాంతానికి వచ్చి గుడ్లు పెడుతుంది. ఆలివ్ రిడ్లీ తాబేలు ఏటా డిసెంబర్ నుంచి మే మధ్య కాలంలో సముద్రం ఒడ్డుకు వచ్చి రాత్రివేళలో 60 నుంచి 150 వరకూ గుడ్లు పెడుతుంది. నచ్చిన ప్రాంతంలో ఇసుకలో అడుగు నుంచి రెండడుగుల లోతులో గుంత తీసి అందులో గుడ్లు పెడుతుంది. అనంతరం గుడ్లను ఇసుకతో కప్పేసి, పది నిమిషాలు అక్కడే ఉండి తిరిగి సముద్రంలోకి వెళ్తుంది.
ఉష్ణోగ్రతలను బట్ట్టి ఆడ, మగ
తాబేలు ఇసుక బొరియల్లో గుడ్లు పెట్టి వెళ్లాక ఉష్ణోగ్రతలను బట్టే ఆడ, మగ నిర్ధారణ అవుతుంది. 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలో గుడ్డు నుంచి బయటకు వస్తే మగ, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య అయితే ఆడ తాబేలు అవుతుంది. అటవీ శాఖ సిబ్బంది గుడ్లను సేకరించి హేచరీలకు తరలిస్తారు. ఇక్కడ కూడా వాటికి సరిపడా ఉష్ణోగ్రతలను కొనసాగించి గుడ్లు బయటకు వచ్చాక సముద్రంలోకి వదులుతారు. ఈ అరుదైన తాబేళ్లను సంరక్షించేందుకు 2010లో అటవీశాఖ తొలిసారిగా అవనిగడ్డ డివిజన్లో రెండు చోట్ల హేచరీలను ఏర్పాటు చేసింది. తొలి ఏడాది రెండు వేల గుడ్లతో ప్రారంభమైన సేకరణ ఏటా పెరుగుతోంది. గతంలో పాలకాయతిప్ప, సంగమేశ్వరం, గుల్లలమోద లైట్హౌస్, ఐలాండ్, జింకపాలెంలో ఈ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఉండేవి. ఈ ఏడాది మచిలీ పట్నం డివిజన్లో మంగినపూడి, పల్లెతుమ్మలపాలెంలో హేచరీలు ఏర్పాటు చేశారు. గత ఏడాది 542 తాబేళ్ల నుంచి 60,838 గుడ్లను సేకరించి హేచరీల్లో భద్రపరచి 53,769 పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాది 655 తాబేళ్ల నుంచి 76,475 గుడ్లను సేకరించి ఇప్పటి వరకూ 39,647 పిల్లలను సముద్రంలోకి పంపించారు. ఈ ఏడాది 70 వేల పిల్లలను వదలాలన్నది లక్ష్యం. మార్చి నెలాఖరున ప్రారంభమైన ఈ ప్రక్రియ మే నెలాఖరు వరకూ కొనసాగుతుంది.
ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు పెట్టిన తరువాత అడవి నక్కలు, అడవి పందుల నుంచి ప్రమాదం ఉంటుంది. తాబేలు గుడ్లు పెట్టే వరకూ ఆ పరిసరాల్లో నక్కలు, పందులు పొంచివుంటాయి. తాబేలు గుడ్డు పెట్టి వెళ్లాక వాటిని తినేస్తాయి. ఈ గుడ్లను కాపాడి సేకరించేందుకు అటవీ శాఖ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. వారు రాత్రి వేళల్లో సంచరిస్తూ తాబేళ్ల అడుగు జాడల ఆధారంగా గుడ్లను సేకరించి హేచరీలకు చేరుస్తారు. సముద్ర నీటిలో ఉండే ఈ రకం తాబేలు ప్రతి మూడు నుంచి నాలుగు గంటలకు ఒకసారి బయటకు వచ్చి గాలి తీసుకుని లోపలకు వెళ్తాయి. చేపల వేటకు ఉపయోగించే గిల్, ట్రాల్, ఘోస్ట్ వలలు వీటి పాలిట యమ పాశాలవుతున్నాయి. మరికొన్ని బోట్లుకు ఉండే పదునైన వస్తువులు తగిలి మరణిస్తున్నాయి. చేపల వేట సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అరుదైన ఈ జాతిని కాపాడిన వారవుతారని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సముద్రంలో ఉండే మలినాలు, వర్థాలు, పాచి, నాచును ఆహారంగా తీసుకుని మత్స్య సంపద వృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహద పడే ఈ ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.


