ఆముదాలపల్లిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆముదాలపల్లిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌డ్రిల్‌

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

ఆముదాలపల్లిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ మాక్‌డ్రిల్‌ బందరు జీజీహెచ్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ శ్రీమన్నారాయణుడికి ప్రత్యేక పూజలు

గన్నవరం: ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం జరిగింది. విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు పాటించాల్సిన స్వీయ సంరక్షణ పద్ధతులు, తోటివారిని కాపాడటంపై ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం మాక్‌డ్రిల్‌ నిర్వహించి అవగాహన కల్పించింది. ప్రథమ చికిత్స, సీపీఆర్‌ చేసే విధానం, అగ్ని ప్రమాదాలు, తుపానులు, పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ కమాండర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ నేతృత్వంలోని రెస్క్యూ బృంద సభ్యులు కె.వెంకటేశ్వర్లు, జి.వెంకట్‌ నిర్వహించిన మాక్‌డ్రిల్‌ ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకటబాలవర్దనరావు, తహసీల్దారు జాలాది విమలకుమారి, అగ్నిమాపక అధికారి ఎన్‌.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

మచిలీపట్నంఅర్బన్‌: ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో అడ్డదిడ్డంగా పార్క్‌ చేసిన వాహనాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులతో మాట్లాడారు. వైద్యులు అందుబాటులో ఉన్నారా, మందులు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పర్యవేక్షకులు, జనరల్‌ సర్జన్‌, ప్రొఫెసర్లు, సీనియర్‌ వైద్యులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన పరికరాలు, మౌలిక వసతులపై వివరాలు సేకరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు తప్పనిసరిగా మచిలీపట్నంలోనే నివసించేలా సూపరింటెండెంట్‌ చూడాలన్నారు. సిబ్బంది కొరతపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లీలా ప్రసాద్‌, ఆర్‌ఎంఓ నిరంజన్‌ కుమార్‌, సీనియర్‌ వైద్యులు పాల్గొన్నారు.

కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన మండలంలోని ఉల్లిపాలెంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని పోలీసు అధికారులు మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామికి అవనిగడ్డ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్‌ పూజలు చేశారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజ జీయర్‌ స్వామిజీ ఆయనను దుశ్శాలువాలతో సత్కరించారు. ఆలయంలో జరుగుతున్న శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వస్తున్న ప్రముఖులు, భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ చాణిక్య ఉన్నారు.

తైక్వాండో జట్ల ఎంపిక

వీరులపాడు: మండలంలోని పొన్నవరం శివారులో ఉన్న అంతర్జాతీయ ఏకత్వ పాఠశాలలో కృష్ణా జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా జట్ల ఎంపికలు జరి గాయి. ఎంపికై న క్రీడాకారులు తిరుపతిలో జరిగే ఐదో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు బస్సే నాగప్రసాద్‌ తెలిపారు. ఈ ఎంపికలకు ఏకత్వా పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మనోజ్‌ అమరనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్‌ దండు రత్నకాంత్‌, ఏకత్వ పాఠశాల వ్యాయామ విద్యా విభాగధిపతి విజయ్‌ కుమార్‌ గోగులమూడి, పీఈటీ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement