గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మునిసిపల్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. మంగళవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) విజయ వాడ కమిటీ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులు పని బంద్ పేరిట ధర్నా నిర్వహించారు. నగర అధ్యక్షుడు టి.ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మునిగిపోయారన్నారు. రోడ్లు ఊడ్చే కార్మికులకు జీతాలు లేక పస్తులు ఉంటే.. ప్రభుత్వం మాత్రం పండుగ చేసుకుంటుందన్నారు. బడా కాంట్రాక్టర్లకు పని చేయకముందే మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తున్నారని, పనిచేసిన కార్మికులకు నెల తర్వాత కూడా జీతం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. జీతాల కోసం మునిసిపల్ కార్మికులు ఆందోళన చేస్తుండగా.. మున్సిపల్ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనలో ఉండడం గర్హనీయమన్నారు.
మార్చి నెల జీతాలు ఇవ్వలేదు..
ఏపీ మునిసిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ అండ్ ఫెడరేషన్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల 21వ తేదీన వచ్చినా మార్చి నెల జీతాలు ఇవ్వలేదన్నారు. ఇదిగో.. అదిగో అంటున్నారే తప్ప కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్నారు. విజయవాడ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. మునిసిపల్ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నగర ప్రధాన కార్యదర్శి ఎస్. జ్యోతిబాసు, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. తిరుపతమ్మ, నగర ఉపాధ్యక్షురాలు ఎం.బుజ్జమ్మ, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
మునిసిపల్ వర్కర్ల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్


