అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం | - | Sakshi
Sakshi News home page

అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం

పటమట (విజయవాడ తూర్పు): సీఎం చంద్రబాబు తన 76వ జన్మదినం సందర్భంగా విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్‌లో సోమవారం సతీసమేతంగా అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు బయట భోజనం చేయాలంటే రూ.100 చెల్లించాల్సిన స్థితిలో రూ.5కే ప్రభుత్వం మంచి ఆహారాన్ని అంది స్తోందన్నారు. ఈ క్యాంటీన్లకు ఇస్కాన్‌ ఫౌండేషన్‌ రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేస్తోందని కొనియాడారు. తన పుట్టిన రోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణకు రూ.76 లక్షల విరాళాన్ని తన భార్య భువనేశ్వరి అందించి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు విరాళాలివ్వాలని కోరారు. మరోవైపు మీడియాతో సీఎం మాట్లాడుతుండగా ఆయన వెంట ఉన్న ఎన్‌ఎస్‌జీ కమాండో నందలాల్‌ షా ఎండవేడికి తట్టుకోలేక అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

రోమి శ్రీసాయికి నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

కోడూరు: కోడూరుకు చెందిన కోటగిరి రోమి శ్రీసాయి నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం కైవసం చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రోమి శ్రీసాయికి ఇటవల నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు రికార్డు సర్టిఫికెట్‌ను అందించారు. 2007వ సంవత్సరంలో రోమి శ్రీసాయి నేషనల్‌ చైల్డ్‌ అవార్డు, దుర్గి చిత్రానికి ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు, ఢిల్లీలో జరిగిన ఆలిండియా మల్టీ లింగ్వెల్‌ ప్రోగ్రామ్‌లో తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఆమె మూడు ముక్కలాట, నా బంగారు తల్లి నవలలు రచించి ప్రచురించారు. బహుముఖ రంగాల్లో ప్రతిభ చూప డంతో ఆమెకు నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు నిర్వాహకులు సర్టిఫికెట్‌ ప్రదానం చేశారు. రోమి శ్రీసాయిని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ సత్కరించి అభినందించారు.

దుర్గమ్మ సన్నిధిలో

మహాలక్ష్మి యాగం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆలయ అర్చకులు సోమ వారం మహాలక్ష్మి యాగం నిర్వహించారు. తొలుత ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య మహాలక్ష్మి యాగాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. లోక కల్యాణార్థం, భక్తుల సౌభాగ్యం కోసం దేవస్థానమే ఈ యాగాన్ని జరిపించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అక్షయ తృతీయ నాడు అమ్మవారిని ఆరాధించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, ధనధాన్యాలకు లోటు ఉండదని భక్తుల నమ్మకమని అర్చకులు పేర్కొన్నారు. యాగం అనంతరం నిర్వహించిన మహా పూర్ణాహుతిలో ఆలయ ఈఓ శీనానాయక్‌, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ లీగల్‌: పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న 11 మంది నిందితుల రిమాండ్‌ సోమ వారం ముగిసింది. దీంతో పోలీసులు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి వారిని వర్చువల్‌గా హాజరు పరిచారు. వచ్చే నెల నాలుగో తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ న్యాయమూర్తి బి.రాధారాణి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement