ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

మచిలీపట్నంఅర్బన్‌: వైద్య, ఆరోగ్య శాఖ అధికా రులు ప్రభుత్వ ఉత్తర్వులను ఇష్టానుసారం వక్రీకరిస్తూ ఉద్యోగుల భవితవ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్రీనివాసరావు, పి.నాగరాజు ఆరోపించారు. కలెక్టరేట్‌లోని మీ–కోసం సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర్‌కు వారు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఉమ్మడి కృష్ణాజిల్లా సంబంధించి హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాఖ జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ నంంబరు 01/పీహెచ్సీ/2025 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీలో ఈ–అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లకు (ఈయూపీహెచ్‌సీ) సేవలు అందించిన ల్యాబ్‌ టెక్నీషియన్ల సర్వీస్‌ వెయిటేజ్‌ మార్కులను కావాలనే పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈయూపీహెచ్‌సీల్లో పనిచేసిన ఉద్యోగులు అవుట్‌ సోర్సింగ్‌ కేటగిరీకి చెందరని అధికారులు చెబుతున్న వాదన అసత్యమని స్పష్టం చేశారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పథకం కింద ప్రభుత్వమే వారి సేవలను వినియోగించుకుందని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా నియామకాలు జరిగాయని గుర్తుచేశారు. వారి పనితీరును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారులు పర్యవేక్షించారని పేర్కొన్నారు. అదే అధికారులు సర్వీస్‌ సర్టిఫికెట్లు జారీ చేసి ఇప్పుడు మాట మార్చడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఒక్కోసారి ఒక్కో జీఓ

గతంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ నంబరు 1/2024లో జీఓ నంబరు 573ని అడ్డుపెట్టుకుని సర్వీస్‌ వెయిటేజ్‌ మార్కులను నిరాకరించారని, తాజాగా నోటిఫికేషన్‌ నంనంబరు 1/పీహెచ్‌సీ/2025లో జీఓ ఆర్‌టీ నంబరు 301ని చూపుతూ మళ్లీ అదే విధంగా కొనసాగిస్తున్నారని శ్రీనివాసరావు, నాగ రాజు ఆరోపించారు. ఒక్కోసారి ఒక్కో జీఓను చూపుతూ అభ్యర్థులను తిరస్కరించడం పరిపాలనా అవ్యవస్థకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇదే విధమైన సేవలు చేసిన ఇతర ల్యాబ్‌ టెక్నీషియన్లకు మాత్రం సర్వీస్‌ వెయిటేజ్‌ మార్కులు ఇచ్చి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఇదే నిబంధన అమలవుతోందని గుర్తు చేశారు. కేవలం ఈయూపీహెచ్‌సీ ఉద్యోగులపైనే వివక్ష చూపడం పక్షపాత ధోరణేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డేటా మాయంపై అనుమానాలు

అత్యంత ఆందోళన కలిగించే అంశంగా, కృష్ణాజిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో 2021 నుంచి 2024 వరకు డీఎస్సీ నియామకాల డేటా మాయమవడంపై శ్రీనివాసరావు, నాగరాజు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల్లో మాత్రం పూర్తి సమాచారం అందుబాటులో ఉండటం గమనార్హమని పేర్కొన్నారు. సమాచారం తొలగింపులో ఏదో దురుద్దేశం ఉన్నట్టుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపి, ఈయూపీహెచ్‌సీ ల్యాబ్‌ టెక్నీషియన్లకు సర్వీస్‌ వెయిటేజ్‌ మార్కులు మంజూరు చేసి సమాన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బందరు శాఖ అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

వైద్య, ఆరోగ్య శాఖలో ఈయూపీహెచ్‌సీ ల్యాబ్‌ టెక్నీషియన్లకు అన్యాయం

డేటా తొలగింపుతో అధికారులపై అనుమానాలు

జిల్లా రెవెన్యూ అధికారికి ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఫిర్యాదు

Advertisement
 
Advertisement
Advertisement