చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తూరు తాడేపల్లి పరిధిలోని పోలవరం కాలువ వద్ద మట్టిని తరలిస్తున్న తెలుగు తమ్ముళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన తమనే అడ్డుకుంటారా అంటూ వారు అధికారులపై వీరంగం చేశారు. కొత్తూరు తాడేపల్లి సమీపంలో పోలవరం కాల్వ ఆర్‌ఎంసీ కెనాల్ మట్టిని కొంతకాలంగా అధికార పార్టీ నాయకులు రేయింబవళ్లు ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీనిపై గ్రామస్తుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అక్రమ తవ్వకాలపై విషయంపై లోకాయుక్త నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదివారం రాత్రి ఈ మట్టి తరలిస్తున్న ప్రాంతానికి ఇరిగేషన్ ఈఈ సుభాని, ఇతర అధికారులు చేరుకుని రెండు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి లారీలలో తరలించడాన్ని గమనించి అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు వీరంగం వేశారు. ఈ సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకున్నా అధికార పార్టీ నాయకులు శాంతించలేదు. అధికారులకు చేతనైంది చేసుకోండంటూ రెచ్చిపోయారు. పొక్లెయిన్లు, లారీలను సీజ్ చేయాలని పోలీసులకు ఇరిగేషన్ అధికారులు సూచించారు. దీంతో రెండు పొక్లెయిన్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కొండలరావు పేర్కొన్నారు. తమ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో అధికార పార్టీ నాయకులు కొత్తపేట పోలీస్‌స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు తమకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని సీఐ పేర్కొనడం గమనార్హం.


