గానగంధర్వుడి కచేరీకి 60 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

గానగంధర్వుడి కచేరీకి 60 ఏళ్లు

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

ఘంటసాల: తెలుగు పాటల్లోని మాధుర్యాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసి, వాటికి ఖ్యాతి, వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి, మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతటి మహా గాయకుడు ఘంటసాల గ్రామంలో గాన కచేరీ చేసి మంగళవారం నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ మంగళవారం నుంచి 2027 ఏప్రిల్‌ 21 వరకు ఏడాది పాటు జరిగే ఆరు దశాబ్దాల వేడుకలు నిర్వహించనున్నారు. ఘంటసాల గ్రామంలోని శ్రీ బాలపార్వతీ జలదీశ్వర స్వామి దేవస్థానంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను కృష్ణాజిల్లా పర్యాటక శాఖ అధికారి గుండె రామలక్ష్మణ్‌ ప్రారంభించనున్నారు.

60 ఏళ్ల క్రితం..

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే హరికథలతో పాటు ఘంటసాల వారి మధుర గానామృతాన్ని ఘంటసాల ప్రాంత ప్రజలకు అందించాలని 60 ఏళ్ల కిందట నాటి గ్రామ పెద్దలు నిర్ణయించారు. వెంకటేశ్వరరావును సంప్రదించడం, ఆయన సమ్మతించడం వెనువెంటనే జరిగిపోయాయి. గ్రామానికి వచ్చిన గాన గంధర్వుడిని గ్రామస్తులు ఏనుగు అంబారీపై ఊరేగించారు. ఘంటసాలకు చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్‌ బంగారు గండపెండేరం తొడిగారు. అనంతరం ఘంటసాల మూడు గంటలకు పైగా ఏకబిగిన కచేరీని నిర్వహించి శ్రోతలను తన గానామృతంతో ఓలలాడించారు. ఆ కచేరీకి ఆరు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఘంటసాల వంశీయులైన స్థానిక విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఘంటసాల విజయలక్ష్మి, ఆమె సోదరి ఘంటసాల మాధవీలతకు చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్‌ మనవడు యార్లగడ్డ రామేశ్వర ప్రసాద్‌ చేతులు మీదగా ఈ నెల 25వ తేదీన స్వర్ణ పతాకాలు, రజిత కంకణాలు బహూకరించనున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల కృష్ణ మోహన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement