మతం పేరిట హక్కులు కాలరాయడం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

మతం పేరిట హక్కులు కాలరాయడం దుర్మార్గం

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కేవలం మతం పేరుతో కాలరాయడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. గాంధీనగర్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ దేశంలో అగ్రవర్ణాల వర్గాల వారు మతం మారి నప్పుడు వారి కుల హోదా, సామాజిక గుర్తింపు మారడం లేదని, కేవలం దళితులు మతం మారినప్పుడే ఎస్సీ హోదా రద్దు చేయడం ముమ్మాటికీ వివక్ష, రాజ్యాంగ విరుద్ధమైన చర్యని స్పష్టంచేశారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే, 75 ఏళ్లుగా ప్రభుత్వం నియమించిన కాకా కలేల్కర్‌, కుమార పిళ్లై, జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా, సచార్‌, దేశముఖ్‌ వంటి అన్ని కమిషన్లు మతం మారినా దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదు, వారిపై అంటరానితనం కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశాయని గుర్తుచేశారు. ఈ శాసీ్త్రయ నివేదికలను పక్కన పెట్టి, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును సాకుగా చూపి దళిత క్రైస్తవులకు అన్యాయం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25 కల్పించిన సమానత్వానికి, మత స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దళిత క్రైస్తవులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్లు శ్రీధర్‌ మాదిగ, ఏటుకూరి విజయ మాదిగ, గుండాల ఆనంద్‌ మాదిగ, ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ కనకపుటి వెంకటరత్నం మాదిగ, ప్రసాద్‌ మాదిగ, అర్బన్‌ నాయకులు మాతంగి సంజయ్‌ మాదిగ, గద్దల కొండ మాదిగ, బద్దేటి రాజు మాదిగ, ఆదామ్‌ మాదిగ, పేరుపొగు బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ

Advertisement
 
Advertisement
Advertisement