ప్రైవేటుకు వద్దంటే వద్దు
రెండేళ్లుగా పనిచేయడం లేదు..
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిర్వహణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకోనుంది. రైతుల్లో అనైక్యతతో పాటు పలు ఇతర కారణాల వల్ల ఇప్పటికే సగానికి పైగా పథకాలు పనిచేయడం లేదు. కొన్ని పథకాలు ఏకంగా మూలన పడ్డాయి. ప్రైవేటుకు అప్పగిస్తే విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు సాగు చేసే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ జిల్లాలో పరిస్థితి..
ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా మెట్ట ప్రాంతం. కృష్ణానదితో పాటు కట్టలేరు, మునేరు, వైరాయేరు, పాలేరు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. మెట్ట ప్రాంత రైతుల సాగు నీటి అవసరాలు తీర్చేందుకు, భూములను సాగులోకి తెచ్చేందుకు ఆయా యేర్లపై ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. జిల్లాలో చిన్నవి, పెద్దవి మొత్తం 118 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద 1,13,511 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఎత్తిపోతల పథకాలను నిర్వహించేది. తర్వాత కాలంలో నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించి నీటిపారుదల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణ చేస్తోంది. రైతు నిర్వహణలోకి రావడంతో ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టింది. రైతుల మధ్య విభేదాలు, రాజకీయాల కారణంగా సక్రమంగా నిర్వహించడం లేదు. ఫలితంగా ఒక్కొక్కటి మూతపడుతూ వస్తున్నాయి. తరచూ మోటార్లు రిపేర్లు, పైపులు దెబ్బతినడం తదితర కారణాలతో సామర్థ్యాన్ని కోల్పోయాయి.
పనిచేయని పథకాలు..
ఎన్టీఆర్ జిల్లాలోని 118 ఎత్తిపోతల పథకాల్లో 45 మాత్రమే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటి కింద మాత్రమే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 46 పథకాలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని చోట్ల రైతుల మధ్య విభేదాలు, రాజకీయ పార్టీల ప్రమేయంతో ఉద్దేశపూర్వకంగా తాళం వేసి ఉంచారు. ఆయకట్టు పరిధిలోని ఒక్కోరైతు ఎకరాకు వెయ్యి రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బులు సక్రమంగా వసూలు కాకపోవడం, మరమ్మతులు వచ్చినపుడు సకాలంలో చేయించకపోవడంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి. 20 పథకాలు పూర్తిగా పనిచేయడం లేదు. 7 పథకాలను పూర్తిగా మూసివేశారు.
ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఎత్తిపోతల పథకాలను ప్రైవేటుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారం నీటి తీరువా వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులైతే దోపిడీకి ఆస్కారం ఉంటుంది. పంటలు సాగు చేసే వారిలో కౌలుదారులే ఉన్నారు. నీటి తీరువా పెంచితే కౌలు రైతులపై అధిక భారం పడే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికే కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. జిల్లాలోని పథకాలకు మరమ్మతులు చేపట్టి పనిచేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కట్టలేరుపై జయంతి గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం గత రెండేళ్లుగా పనిచేయడం లేదు. అక్కడక్కడ పైపులైన్లు దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. పూర్తి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే నిర్వహిస్తే మేలు.
– జి. కృష్ణారెడ్డి, రైతు, జయంతి
ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడం సరికాదు. ఈ నిర్ణయం కౌలు రైతులకు ఎక్కువ నష్టం చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విచ్చలవిడిగా నీటి తీరువా వసూలు చేసే అవకాశం ఉంది. దోపిడీ పెరిగిపోతుంది. కౌలు రైతులకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రభుత్వం ఏం చేస్తుంది? పథకాల నిర్వహణలో ప్రభుత్వ బాధ్యత లేదా? ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
– పి. జమలయ్య,
ప్రధాన కార్యదర్శి, కౌలు రైతు సంఘం


