పాలిసెట్‌కు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు ఏర్పాట్లు

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

చిలకలపూడి(మచిలీపట్నం): పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌)–2026 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. డీఆర్వో మాట్లాడుతూ ఏప్రిల్‌ 25వ తేదీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో 5,634 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా విజిలెన్స్‌, లా అండ్‌ ఆర్డర్‌ పరిరక్షణ కోసం ప్రత్యేక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జాన్‌ పీటర్‌, ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ రవీంద్రబాబు, జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కారు ఢీకొని జింక మృతి

పెనుగంచిప్రోలు: కారు ఢీకొని జింక మృతి చెందిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి జాతీయ రహదారిపై వేదాద్రి వైపు వెళ్తున్న కారు కొణకంచి క్రాస్‌రోడ్స్‌ వద్ద పొలాల్లో నుంచి అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న జింకను ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన జింక అక్కడికక్కడికే మృతి చెందింది. ఘటన జరిగిన వెంటనే ఫారెస్ట్‌ జగ్గయ్యపేట సెక్షన్‌ ఆఫీసర్‌ కె. రవివర్మ, వీఆర్‌ఓ పి. శ్రీను, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు హైవే మొబైల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలొదిలిన జింకను రోడ్డు పక్కకు తెచ్చారు. వారందరి సమక్షంలో నవాబుపేట పశువైద్యాధికారి శంకర్‌నాయక్‌ జింకకు పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. అనంతరం జేసీబీతో గుంత తీయించి ఖననం చేశారు.

ముగిసిన కొండపల్లి బొమ్మల పండుగ

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా జరుగుతున్న కొండపల్లి ఖిల్లా, కొండ పల్లి బొమ్మల పండుగ సోమవారం రాత్రి ముగిసింది. మూడురోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు బొమ్మల ప్రదర్శన, కళాకారుల ర్యాలీ ప్రదర్శనలతో పట్టణంలో ఉల్లాసాన్ని నింపాయి. ముంగిపు కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పూర్వం శ్రీ కృష్ణదేవరాయులు కాలంలో వీధుల్లో రత్నాలు రాసుల్లా పోసి అమ్మేవారని, నేడు కొండపల్లి బొమ్మలను రత్నాల్లా వీధుల్లో అమ్ముతున్నారని తెలిపారు. కొండపల్లి బొమ్మలు దేశానికి నిజ మైన వారసత్వ సంపద అన్నారు. కొండపల్లి బొమ్మల పోటీల్లో విజేతలుగా నిలిచిన శంకర్‌, గౌస్‌ బాషా, షేక్‌ ఖాజాకు వరుసగా రూ.30వేలు, రూ. 20వేలు, రూ. 10వేలను బహుమతులుగా అందజేశారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, కలెక్టర్‌ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.

అప్పు చేయడమే సంపద సృష్టా?

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా అంటూ జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 3.50లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదు, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు పూర్తిగా అటకెక్కాయని, తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారని కూటమి పాలకులను ప్రశ్నించారు. సోమవారం విజయవాడలోని జై భీమ్‌ భారత్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు కూడా నిండని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూడున్నర కోట్లు అప్పులు చేసిందని, ఇందుకు గల కారణాలను స్పష్టం చేయాలన్నారు. ప్రతి మంగళవారం అప్పులు తెస్తూ మంగళవారం ప్రభుత్వంగా కూటమి మిగిలిపోయిందన్నారు.

మావిగన్‌ ఓ మంచి ప్రతిపాదన

ప్రతిపక్షనేత చేసిన మావిగన్‌ ప్రతిపాదనను ఈ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో స్పష్టం చేయాలని శ్రావణ్‌ డిమాండ్‌ చేశారు. అమరావతిలో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రజలు రావడానికి వీల్లేదా అని ప్రశ్నించారు. వాళ్లేమైన అంటరాని వాళ్లా అని నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement