ఎ.కొండూరు: మండల పరిధిలోని చైతన్యనగర్ తండాకు చెందిన భూక్యా తిరిపి (65)కిడ్నీ వ్యాధితో బాధపడూతూ ఆదివారం మృతి చెందారు. గత ఐదేళ్లుగా వ్యాధితో పోరాడుతున్న ఆమె విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటూ తుదిశ్వాస విడిచారు. తిరిపి మృతిపట్ల సీపీఎం నాయకులు జెట్టి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పానెం ఆనందరావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తిరిపి వైద్యం కోసం ఐదేళ్లలో రూ.5 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి ఏడుగురు సంతానం ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే ఆకుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మండలంలో కిడ్నీ వ్యాధుల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికీ కృష్ణా జలాలు సరఫరా చేయడంతో పాటు బాధితులకు ఉచిత మందులు, పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


