స్కేటింగ్‌ పోటీల్లో పతకాలు | - | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌ పోటీల్లో పతకాలు

Apr 20 2026 9:35 AM | Updated on Apr 20 2026 9:35 AM

స్కేటింగ్‌ పోటీల్లో పతకాలు ఆస్పత్రి నుంచి చల్లపల్లి ఎస్‌ఐ డిశ్చార్జి గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి దుర్మరణం బెట్టింగ్‌ ముఠాపై పోలీసుల దాడులు

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): తైవాన్‌లోని హ్సిన్‌చూ నగరంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు జరిగిన 2026 ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ పోటీల్లో నగరానికి చెందిన చిన్నారి కె.దియశ్రీ (11) పలు విభాగాల్లో పతకాలు సాధించింది. కపుల్‌ డాన్స్‌ క్యాడెట్‌ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్‌ మెడల్‌, పెయిర్‌ స్కేటింగ్‌ క్యాడెట్‌ విభాగంలో తృతీయ స్థానం సాధించి బ్రాంజ్‌ మెడల్‌ సాధించడంతో పాటుగా సోలో డాన్స్‌ ఎస్పోయిర్‌ గరల్స్‌ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. దియశ్రీ నగరంలోని సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. స్కేటింగ్‌ క్రీడతో పాటుగా సాంప్రదాయ నృత్యంలో కూడా దియశ్రీ శిక్షణ పొందుతోంది. స్కేటింగ్‌ కోచ్‌ పంచాడ సత్యనారాయణ, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు స్కేటింగ్‌ క్రీడాకారులు దియశ్రీకి అభినందనలు తెలిపారు.

చల్లపల్లి: పేలుడు ఘటనలో గాయపడి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం చల్లపల్లి ఎస్‌ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు ఆదివారం డిశ్చార్జి అయ్యారు. గత నెల 31న చల్లపల్లి పోలీస్టేషన్‌లో మందుగుండు సామగ్రి తరలిస్తుండగా పెట్టెలో నుంచి కిందికి జారి భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ దుర్గాంజనేయులుతో పాటు కోర్టు కానిస్టేబుల్‌ అబ్దుల్లా, జీపు డ్రైవర్‌ నాగరాజులు తీవ్రంగా గాయపడటంతో వారిని గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా చికిత్స అనంతరం 18 రోజుల తరువాత ఎస్‌ఐ దుర్గాంజనేయులు డిశ్చార్జి అయ్యి ఆదివారం చల్లపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరూ ఇంకా చికిత్స పొందుతున్నారు. సోమ, మంగళవారాల్లో దుర్గాంజనేయులు స్టేషన్‌ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిసింది.

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: చైన్నె – కోల్‌కత్తా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన బాపులపాడు మండలం వీరవల్లి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో హైవేపై గుర్తు తెలియని వృద్ధుడిని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడు మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. మృతుడి వివరాలను సేకరిస్తున్నారు.

పటమట(విజయవాడతూర్పు): పటమట భారతీనగర్‌లోని పార్క్‌ ఐరిస్‌ హోటల్లో బుకీలు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పటమట, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం క్రికెట్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి హైదరాబాద్‌కు చెందిన బుకీ డూడ్‌ గణేష్‌, ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన ఆపరేటర్‌ పితాని ప్రసాద్‌ పాటు కానూరుకు చెందిన తోట శ్రీనివాసరావు, తాడిగడప డొంకరోడ్డుకు చెందిన పసుపులేటి రంగబాబును అదపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్‌, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకుని పటమట పీఎస్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement