బాలుడిని తల్లికి అప్పగించిన ఎస్పీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. బాలుడు ఆచూకీ కనుగొని తల్లి చెంతకు చేర్చారు. ఈ సందర్భంగా శనివారం ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాదాసు సుమమ్మ ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం తన పది నెలల కుమారుడిని వెంటబెట్టుకుని విజయవాడ ఆటోనగర్‌కు భిక్షాటనకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఆమె వద్దకు వెళ్లి తమ వద్ద పాత బట్టలు ఉన్నాయని, వాడుకోవటానికి ఇస్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. కంకిపాడు ఫ్లై ఓవర్ సమీపంలో ఆమెను దించి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆమె సమీపంలోని పెనమలూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర ఆధ్వర్యంలో సీఐ జేవీ రమణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సీసీ పుటేజీలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలుడి కోసం గాలించారు. 24 గంటల్లో నిందితుల్లో ఒకరైన కొమిరి కాళి (ఆటోడ్రైవర్)ను పెనమలూరులో పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారంతో బాలుడిని కొనుగోలు చేసిన మచిలీపట్నానికి చెందిన గంజాల వెంకటనాగ శ్రీనివాసరావు, షేక్ రెహనాను అదుపులోకి తీసుకున్నారు.
ముందుగానే ఒప్పందం..
ఆటోడ్రైవర్ కాళీతో పాటు మరో నలుగురు ఇదే తరహాలో అనేక నేరాలకు పాల్పడుతూ రద్దీ ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించిన చిన్నారులను కిడ్నాప్ చేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పది నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు లక్షన్నరకు విక్రయించారు. గతంలో శ్రీనివాసరావు, రెహనాలు పిల్లాడి కోసం వీరిని మూడు నెలల క్రితం సంప్రదించగా నిందితులు ఈ పనికి పూనుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును 24 గంటల్లో చేధించిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, సీఐ రమణ, సిబ్బంది పాల్గొన్నారు.


