దర్గా భూములనూ వదలని టీడీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

దర్గా భూములనూ వదలని టీడీపీ నేతలు

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ వక్ఫ్‌బోర్డు భూములలో వేసిన రోడ్డు పరిశీలన

పామర్రు: టీడీపీ నేతలకు కాదేదీ ఆక్రమణలకు అన్నర్హం అన్న చందంగా పామర్రు టీడీపీ నేతల తీరు ఉన్న దని, చివరికి దర్గా భూములను కూడా వదలకుండా తమ అవసరాలకు వాడుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ అన్నారు. స్థానికంగా చల్లపల్లి రోడ్డులో దర్గా భూములను ఆక్రమించుకుని వేసిన అక్రమ వెంచర్లను ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ చల్లపల్లి రోడ్డులోని దర్గా భూమికి అవతల పక్కన స్థానిక టీడీపీ నేత కుదరపల్లి ప్రవీణ్‌ తన తండ్రి పేర సర్వే నంబరు 4378లో 4.25 ఎకరాలు, గణేష్‌కు సంబంధించిన నాలుగు ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌కు ఇచ్చారు. కూటమి నేతల భూమికి, స్థానిక పామర్రు– చల్లపల్లి రోడ్డుకు మధ్యలో దర్గా భూమి ఉందన్నారు. ఇది వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అభివృద్ధికి అటంకంగా మారిందని తెలిపారు. దీంతో దర్గా భూమిలో సుమారు 50 సెంట్లను 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. దర్గా నిర్వహణ కోసం ఎవరో దాతలు ఇచ్చిన భూమిని టీడీపీ నేతలు ఏవిధంగా ఆక్రమించుకుంటారని ప్రశ్నించారు. 99 ఏళ్లకు లీజుకు తీసుకుని దానిలో రియల్‌ ఎస్టేట్‌ కోసం 40 అడుగుల రోడ్డుని వేయటం అన్యాయం కాదాని ప్రశ్నించారు.

మట్టి తోలకాలతో కోట్లు గడించారు..

మండల పరిధిలో నిబంధనలకు తిలోదాలు ఇచ్చిన అడ్డగోలుగా మట్టిని తెగనమ్ముకున్న మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. నేను పామర్రులో ఓ ఇల్లు కట్టుకుంటే నాపై బురద చల్లడం నా కుటుంబ సభ్యులపై అన్యాయంగా మాట్లాడుతున్నారని అన్నారు. కూటమినేతల తప్పులను ఎత్తి చూపటం వాటిని స్థానిక ప్రజలకు తెలియజేయటమే ఒక ప్రతిపక్ష నాయకునిగా మా పని అన్నారు.

జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం..

ఈ వక్ఫ్‌ బోర్డు భూమిని తిరిగి కూటమి నేతల వద్ద నుంచి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు అర్జీని సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మూల్పూరి హరీష, నామా వెంకటేశ్వరరావు, గవాస్కరరాజు, ఎంపీపీలు డి. అశోక్‌కుమార్‌, గోగం సురేష్‌, వైస్‌ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యురాలు పి.రత్నకుమారి, మండల అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, రాజులపాటి రాఘవరావు, గోళ్ల సోమేశ్వరరావు, నాయకులు లంకపల్లి సురేష్‌, డి.బాల వెంకటేశ్వరరెడ్డి, సజ్జా సుబ్రమణ్యం, డీడీ ప్రసాద్‌, టౌన్‌ అధ్యక్షులు సురేష్‌రెడ్డి, రాఘవరెడ్డి తదితర ఐదు మండలాలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement