ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలి

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఎస్‌.చిరంజీవి డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కేబీఎన్‌ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న పదో తరగతి స్పాట్‌ కేంద్రం బయట గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కనీసం ఉద్యోగుల పీఆర్సీని పట్టించుకోలేదని విమర్శించారు. తక్షణం పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ అమలు వచ్చే వరకూ ఐఆర్‌ 30 శాతం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను చేపట్టాలని కోరారు. ఫ్యాప్టో డెప్యూటీ సెక్రటరీ జనరల్‌ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మలిదశ పోరాటంలో భాగంగా ఈ నెల 25, 26, 28 తేదీల్లో జరిగే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఫ్యాప్టో ఎన్టీఆర్‌ జిల్లా చైర్మన్‌ ఎ.సుందరయ్య, కార్యదర్శి ఇంటి రాజు నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కె.శ్రీనివాసరావు, జి.రామారావు, సయ్యద్‌ ఖాసీం, వి.రాధిక, జి.అనుగ్రహ ప్రసాద్‌, అరుణకుమారి, సురేష్‌ కుమార్‌, ఎం.కృష్ణయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement