తిరువూరులో వాహనాల తనిఖీ పేరుతో అక్రమ వసూళ్లు రాత్రి వేళల్లో వాహనచోదకుల్ని బెదిరిస్తూ దందా వాణిజ్య పన్నుల అధికారుల పేరుతోనూ తనిఖీలు, వసూళ్లు
అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
తిరువూరు: నియోజకవర్గంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులమంటూ కొందరు అనధికారిక వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో తిరువూరులో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల చెక్‌పోస్టులు ఉండగా, రాష్ట్ర విభజన తదుపరి వీటిని తొలగించారు. స్థానికంగా ఆయా శాఖల కార్యాలయాలు లేకపోవడం, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో కొందరు వ్యక్తులు వాహనదారులను బెదిరిస్తూ దండుకుంటున్నారు. గత నెలరోజుల్లో తిరువూరు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం, పశువుల సంత, లక్ష్మీపురం సెంటర్‌లలో, అక్కపాలెం– పేరువంచ రహదారిలో రాత్రివేళల్లో వాహనాలు తనిఖీ చేసిన వ్యక్తులు తాము రవాణా శాఖాధికారులమని హంగామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ, వాణిజ్య పన్నుల అధికారులమంటూ తనిఖీకి వచ్చేవారిలో ఎవరు అసలో, ఎవరు నకిలీనో తెలియట్లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగనియంత్రణకు, ప్రమాదాల నివారణకు పోలీసులు రహదారులపై ఏర్పాటు చేసిన స్టాపర్ బోర్డులను అడ్డుపెట్టి పలువురు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
యూనిఫాం లేకుండానే తనిఖీలు..
ఇబ్రహీంపట్నం–జగదల్‌పూర్ జాతీయ రహదారిపై, లక్ష్మీ పురం–మచిలీపట్నం జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు యూనిఫాం లేకుండా తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యక్తులు సైతం వసూళ్లకు పాల్పడుతున్నారు. విజయవాడ, గన్నవరం నుంచి వస్తున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలలో ఎన్ని వాహనాలపై జరిమానా విధించిందీ, ఎక్కడ తనిఖీ చేసిందీ వివరాలను తెలియజేయట్లేదు. తిరువూరు అసలు ఏ అధికారి పరిధిలో ఉందో కూడా వాహనదారులకు తెలియని పరిస్థితి నెలకొంది.
కార్యాలయాల ఏర్పాటులో తీవ్ర జాప్యం..
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఐదేళ్ల క్రితం ఏర్పడినప్పటికీ తిరువూరులో ఇంతవరకు పలు కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. వాహనచోదకులకు నిత్యం అవసరమైన రవాణాశాఖ కార్యాలయం తిరువూరులో లేకపోవడం, గతంలో నూజివీడు ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగ్గా, ఇప్పుడు గన్నవరం వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరులో రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు గతంలో పలుమార్లు స్థల పరిశీలన జరిపినా కార్యాచరణ జరగలేదు.
అనధికారికంగా వాహనాల తనిఖీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల పాత నేరస్తులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వారిపై నిఘా ఉంచుతాం.
– గిరిబాబు, ఇన్‌స్పెక్టర్, తిరువూరు పోలీస్‌స్టేషన్


