మచిలీపట్నంఅర్బన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) 42 రోజుల వేసవి శిక్షణ కోర్సును మే 1 నుంచి జూన్ 11వరకు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో ఉన్నాయన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందదలచిన అభ్యర్థులు మే 1వ తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి, గరిష్టంగా 45ఏళ్లు మించకూడదన్నారు.
అర్హతలివి..
ఎస్‌ఎస్‌సీ లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ వృత్తి విద్య కోర్సు ఉత్తీర్ణత, ఎస్‌బీటీఈటీ గుర్తించిన కోర్సులు, ఐటీఐల ద్వారా పొందిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, హ్యాండ్లూమ్ వీవింగ్ వంటి జాతీయ సంస్థల సర్టిఫికెట్లు లేదా పరిశ్రమల శాఖ జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలని తెలిపారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం లేదా సమాన సంస్థల నుంచి కర్ణాటక సంగీతం(గానం/వాద్యం)లో డిప్లొమా, లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (బీఎఫ్‌ఏ) కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఇతర రాష్ట్రాల వారు..
ఇతర రాష్ట్రాల అభ్యర్థులు తమ విద్యా, సాంకేతిక అర్హతలను ఆంధ్రప్రదేశ్ వెలుపల బోర్డులు లేదా సంస్థలలో పొందినట్లయితే, ప్రవేశానికి ముందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల నుంచి అనుమతి పొందాలని సూచించారు. ఈ కోర్సుకు దరఖాస్తులు ఏప్రిల్ 26వరకు స్వీకరిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్www. bse.ap.gov.inను సందర్శించాలన్నారు.
నాగాయలంక: సముద్ర జలాల్లో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మెకనైజ్డ్, మోటారు బోటులలో మత్స్యకారుల చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుందని అవనిగడ్డ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి వానపల్లి సత్యనారాయణ గురువారం తెలిపారు. ఏపీ మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం జూన్14వరకు (61రోజులు) ఈ నిషేధం అమలు ఉంటుందని వివరించారు. ఈ కాలంలో మత్య్సకారులు సముద్రంలో చేపలు, రొయ్యల వేటలను పూర్తిగా నిలిపి వేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఇంజిన్ లేని సంప్రదాయక నావలకు మాత్రం నిషేధం వర్తించదని పేర్కొన్నారు. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి సమయం కాబట్టి తల్లి జాతిని సంరక్షించడం, చేపల జనాభా పెరుగుదలను ప్రోత్సహించడంతో సముద్రపు మత్స్య సంపద సుస్థిరత సాధించడం కోసమే ఏటా వేట నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలంలో చేపల వేట చేయకుండా మత్స్యకారులు మత్స్యసంపద అభివృద్ధికి సహకరించాలని, చట్టాన్ని అతిక్రమించి చేపలవేట సాగిస్తే శిక్షార్హులతారని చెప్పారు.
విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో గురువారం రిమాండ్ ముగియడంతో బెయిల్‌పై ఉన్న 14 మంది నిందితులు ఎకై ్సజ్ న్యాయస్థానంలో హాజరయ్యారు. మిగిలిన నిందితులలో ఏడుగురు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయగా, నలుగురు నిందితులు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయలేదు. 6వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి లెనిన్‌బాబు నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ, విచారణను ఈనెల 23వ తేదీ వరకు వాయిదా వేశారు.


