దుర్గగుడి టాయిలెట్స్‌లో గుర్తు తెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

దుర్గగుడి టాయిలెట్స్‌లో గుర్తు తెలియని మృతదేహం

Apr 10 2026 10:39 AM | Updated on Apr 10 2026 10:39 AM

మూడు నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు అనుమానాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి దిగువన కనకదుర్గనగర్‌లోని టాయిలెట్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. కనకదుర్గనగర్‌లోని పురుషుల టాయిలెట్స్‌ మొదటి బాత్‌రూమ్‌ నుంచి భరించరాని దుర్వాసన వస్తుండటంతో, అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పక్క టాయిలెట్స్‌లో పైకి ఎక్కి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్స్‌ లోపల వైపున గడియ పెట్టుకుని ఉండటం, ఓ వ్యక్తి కింద పడిపోయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్‌ పోలీసులు మృతుని ఒంటిపై ఉన్న ప్యాంట్‌, గోడపై ఉన్న షర్టులో అతనికి సంబంధించి గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. కనీసం మృతునికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను యాచకుడు అయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల కిందట మృతి చెంది ఉంటాడని దేవస్థాన అధికారులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

శానిటేషన్‌ సిబ్బంది నిర్లక్ష్యం..

ఘటనలో శానిటేషన్‌ విభాగానికి చెందిన సూపర్‌వైజర్‌, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. మూడు, నాలుగు రోజులుగా టాయిలెట్‌ డోర్‌ వేసి ఉంటే కనీసం లోపల ఎవరు ఉన్నారు.. అతని పరిస్థితి ఏంటని ఆరా తీయాల్సి ఉండగా, అదేమి పట్టనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. అసలు మూడు రోజులుగా శానిటేషన్‌ సిబ్బంది టాయిలెట్స్‌ను శుభ్రం చేయలేదని తెలుస్తోంది. టాయిలెట్స్‌లో ఉన్న వ్యక్తి బయటకు రాకపోయినా సిబ్బంది పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గుర్తించలేని విధంగా మృతదేహం..

మృతిచెందిన వ్యక్తి మృతదేహం గుర్తించలేని విధంగా మారిపోయింది. ఘటన గురించి తెలుసుకున్న దుర్గగుడి ఈవో శీనానాయక్‌ కనక దుర్గనగర్‌కు చేరుకున్నారు. టాయిలెట్స్‌లో ఒకరు మృతి చెంది ఉన్నా కనీసం గుర్తించలేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకదుర్గనగర్‌లో శానిటేషన్‌ పనులను పర్యవేక్షించే సూపర్‌వైజర్‌, స్వీపర్‌ ఒకరికి మరొకరు పొంతనలేని సమాధానం ఇవ్వడంపై వారిపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. మరో వైపున ఆలయంలో శానిటేషన్‌పై భక్తుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో గురువారం మధ్యాహ్నమే శానిటేషన్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టాయిలెట్స్‌ను ప్రతి మూడు గంటలకు ఒక సారి శుభ్రం చేయాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement