వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను, ఆ చానల్‌ను ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై అగౌరవంగా మాట్లాడిన ఏబీఎన్ రాధా కృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం మాచవరం పోలీస్‌స్టేషన్‌లో పార్టీ నేతలతో కలిసి దేవినేని అవినాష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వైఎస్ జగన్ సూచించారన్నారు. అప్పటి నుంచి కూటమి నేతలు, ఎల్లో మీడియా వైఎస్సార్ సీపీపై విరుచుకుపడుతోందన్నారు. రూ.లక్షల కోట్లతో అమరావతి అభివృద్ధి చేసే బదులు రూ.20వేల కోట్లతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయవచ్చని చెప్పారన్నారు. కూటమి నేతల స్టాండ్ ఏమిటో ఈ ప్రాంత కూటమి నేతలు మాట్లాడాలన్నారు. మావిగన్ చెప్పినప్పటి నుంచి రోత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీ పెట్టి పారిపోయినోళ్లు
మాట్లాడుతున్నారు..
గతంలో ఐపీ పెట్టి నగరాన్ని వదిలి పారిపోయినోళ్లు ఇప్పుడు జగన్ గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ఎంపీ అంటే మట్టి, పేకాటగా మార్చేశారన్నారు. అవినీతి, కబ్జాలకు కేరాఫ్‌గా కేశినేని చిన్ని ఉన్నారని ఆరోపించారు. ఇంకా మూడేళ్లే మీ అధికారం, ఆ తర్వాత మీ అడ్రస్ కూడా ఎవరికీ దొరకకుండా పారిపోతారన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ దారుణంగా మాట్లాడితే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నారా లోకేష్ ఏమయ్యారని ప్రశ్నించారు. రాబోయేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలని దేవినేని అవినాష్ అన్నారు.
కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, సీనియర్ నేతలు వెంకట సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు వియ్యపు అమర్నాథ్, తంగిరాల రామిరెడ్డి, పుప్పాల కుమారి, పార్టీ నేతలు నత్తా యోనారాజు, వడ్లమూడి సంపత్, ఇందు పల్లి సుభాషిణి, మాధవి, రమణ, ఆళ్ల చెల్లారావు, మాతంగి రాజేష్, సొంగా రాజ్‌కమల్ పాల్గొన్నారు.


