రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని, నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నీటి సరఫరా, విద్యుత్, డ్రెయినేజీ, అమృత్ 2.0 తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. నగరంలో ప్రస్తుతం 14 రిజర్వాయర్లు ఉన్నాయని, మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణంపై ఏజెన్సీలతో చర్చించామని తెలిపారు. అమృత్ పథకం కింద నగరానికి రూ.65 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు నిధులు వస్తాయని పేర్కొ న్నారు. ఇందులో రూ.15 కోట్లు నీటి సరఫరా, పైప్‌లైన్ల మార్పిడి పనులకు కేటాయించగా, మిగిలిన నిధులు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం సంబంధిత పనులకు వినియోగిస్తామని పేర్కొన్నారు. డ్రెయినేజీ పనుల కోసం రూ.13 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికే టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. నగరంలో వీధి దీపాల పనితీరును సమీక్షించిన మంత్రి, మరో రెండు వేల కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఆస్తి పన్నులు, అద్దెలు తదితర బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు. ప్రస్తుతం రూ.24 కోట్ల వరకు పన్నుల బకాయిలు ఉన్నాయని, రూ.20 కోట్ల వరకు విద్యుత్ బిల్లుల భారం ఉందని వివరించారు. మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పినిశెట్టి నాగ ఛాయాదేవి, దేవరపల్లి అనిత, మరకాని సమతాకీర్తి, దింటకుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


