ఆధారాలు లేని నగదు, కారు సీజ్ పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆధారాలు లేని రూ.2 కోట్ల నగదు, కారును గుణదల పోలీసులు సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం రాత్రి పడవల రేవు ఫుడ్ కోర్టు సమీపంలో సీఐ సత్య రమేష్ ఆధ్వర్యంలో గుణదల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఆ వైపు ఓ కారులో వచ్చిన వ్యక్తులు పోలీసులను చూసి వెనుకకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అనుమానించిన సీఐ సత్యరమేష్ ఆ కారును ఆపి తనిఖీ చేశారు. ఎటువంటి పత్రాలు లేని రూ.2 కోట్ల నగదు కనిపించింది. కారులో ఉన్న వ్యక్తులను గుజరాత్‌కు చెందిన బల్వంత్ అమర్‌సింహసోలంకి, అల్పేష్ కుమార్‌గా గుర్తించారు. ఆ నగదు గురించి పోలీసులు ఆరా తీయగా, తాము ఒడిశాలోని బరంపురం నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల రైతుల నుంచి సరుకు కొనుగోలు చేసేందుకు నగదుతో వస్తున్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. ఆ నగదుకు సంబంధించిన పత్రాల గురించి పోలీసులు ప్రశ్నించగా వారు చూపించలేకపోయారు. ఆ నగదును తమ యజమాని ఇచ్చారని, తమకు ఏమీ తెలియదని.. విజయవాడ వెళ్లిన తరువాత ఎవరికి ఇవ్వాలో చెబుతామన్నారని పేర్కొన్నారు. బరంపురం నుంచి బైపాస్ మీదుగా నగరంలోకి వచ్చామని వెల్లడించారు. నగదుకు సంబంధించి ఆధారాలు చూపించకపోవటంతో గుణదల పోలీసులు రూ.2 కోట్ల నగదు, కారును సీజ్ చేసి బల్వంత్ అమర్‌సింహసోలంకీ, అల్పేష్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నగదుకు ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.


