ధర లేక.. దిక్కు తోచక! క్వింటాకు రూ.700
నష్ట పోయాను
ప్రభుత్వం మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రూ.1700కు అమ్మడంతో క్వింటాకు రూ.700 నష్టపోయాను. వర్షానికి పంట నేల వాలిపోవడంతో ఎకరానికి రూ.3 వేలు అయ్యే ఖర్చు రూ.7 వేలు అయింది. వాతావరణం కూడా మారుతుండటంతో కల్లంలోనే అమ్ముకుంటున్నాం.
ప్రభుత్వం ఆదుకోవాలి
రైతుల వద్ద ఉన్న పంటను ప్రభుత్వం తక్షణం గిట్టుబాటు ధర క్వింటా రూ.2,400కు కొనుగోలు చేయాలి. రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికే రైతులు దళారుల ద్వారా పంటను విక్రయిస్తున్నారు. మొత్తం దళారుల చేతిలోకి వెళ్లకముంరే ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా విక్రయాలు చేయాలి.
● పెనుగంచిప్రోలు: కొనుగోలు కేంద్రాలు లేక మద్దతు ధర రాక రైతు అవస్థ పడుతున్నాడు. ఖరీఫ్ సమయంలో అధిక వర్షాలు రావడంతో రైతులు దెబ్బతిన్నారు. పండిన కొద్దిపాటి పత్తికి మద్దతు ధర లేక ఆదుకోవాల్సిన సీసీఐ కూడా నాణ్యత పేరుతో కొనుగోళ్లు అంతగా చేయలేదు. పత్తిని కోల్పోయిన రైతులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేపట్టారు. మొదట్లో వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు బాగుంటాయని రైతులు ఆశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ముదురు పంట నేలకొరిగింది. ఈ దశలో కోతలు కూడా జోరందుకున్నాయి. మిషన్లతో కోత కోయిస్తున్న రైతులు ఎకరానికి రూ.3000 నుంచి రూ.3,500 చెల్లిస్తున్నారు. వర్షాలకు నేలకొరిగిన పంటను యంత్రాలతో కోయించే వీలు లేకపోవడంతో కూలీలతో కంకులు కోయించి యంత్రాలతో గింజలు తీసుకోవాల్సి ఉంది. దీంతో ఎకరానికి రూ.7 వేల నుంచి రూ.7,500 వరకు అవుతుందని రైతులు వాపోతున్నారు.
రైతులు ఇంతగా చేసినా గిట్టుబాటు ధర లేదని వాపోతున్నారు. రబీలో ఎన్టీఆర్ జిల్లాలో రైతులు 58 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. రైతులు ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టగా ఎకరానికి సరాసరి సుమారు 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. క్వింటాకు ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది.
మొక్కజొన్న కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు పంటను నిల్వ చేసుకోలేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు క్వింటా రూ.1600 నుంచి రూ.1800 అడుగుతున్నారని వాపోతున్నారు. దీంతో క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ సమీపంలోని గండేపల్లి, పెద్దవరం వద్ద బయో ఇథనాల్ కంపెనీలు ఉన్నాయని, గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తే మేలు జరుగుతుందని, ఆదిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా కొనుగోళ్లు జరగక పోవడంతో రైతులు కల్లాల్లోనే తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. పక్కన ఉన్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు మారుతున్న వాతావరణం నేపథ్యంలో కోసిన పంటను నిల్వ చేసుకోలేక దళారులకు విక్రయిస్తున్నారు. పంట చేతికి వస్తున్న తరుణంలో దళారులు బారిన పడకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
–జాజి గోపి, రైతు, శింగవరం,
వత్సవాయి మండలం
–ఏలూరి శివాజీ, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు
గిట్టుబాటు ధర లేక...
కొనుగోలు కేంద్రాలు ఏవీ!
మార్క్‌ఫెడ్‌తో కొనుగోళ్లు చేయించండి
కొనుగోలు కేంద్రాలు లేవు
మద్దతు ధర రూ.2,400..
వ్యాపారులిచ్చేది రూ.1700
వర్షాలకు నేలకొరిగిన పంట
కోతకు అదనపు ఖర్చు
వర్షాలు పడతాయన్న సూచనలతో రైతన్న ఆందోళన