విస్సన్నపేట: ఒక ప్రైవేటు కళాశాలలో డీఫార్మసీ చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇవి.. మండలంలోని తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్(22) స్థానిక పుట్రేలరోడ్డులోని ఫార్మసీ కళాశాలలో డీఫార్మసీ మొదటి సంవత్సరం హాస్టల్‌లో ఉండి చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వెళ్లిన కార్తీక్‌ను తన తండ్రి సోమవారం ఉదయం కళాశాలలో దిగబెట్టి వెళ్లాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున తన పక్క రూంలో ఉండే విద్యార్థులు వాష్ రూం కని వెళ్లగా.. దాని పక్కనే ఖాళీగా ఉండే ఒక గదిలో ఫ్యాన్ హుక్‌కు కార్తీక్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. మృతికి గల కారణం తెలియరాలేదు. ఈ మేరకు మృతుడి తండ్రి బాలక్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ అలివేలు మంగ తెలిపారు. హాస్టల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. విస్సన్నపేట సీహెచ్‌ిసీలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కృత్తివెన్ను: మండల పరిధిలోని లక్ష్మీపురం వద్ద 216 నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఒడుగు నాగేశ్వరావు (45) మృతి చెందగా, కుమారుడు కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో నరసాపురం వైపు వెళ్తున్న కారు బంటుమిల్లి వైపు వెళ్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న నాగేశ్వరరావు, కార్తీక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన తండ్రి ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడికి చికిత్స జరుగుతుందన్నారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లాంచీల రేవు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏ పైడిబాబు తెలిపారు.
జి.కొండూరు: తల్లిదండ్రులు లేని చిన్నారిని మేనత్త వేధిస్తున్న ఘటన కట్టుబడిపాలెం గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దళిత బహుజన రిసోర్స్‌సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత జి.కొండూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలలోకి వెళ్తే.. బీహర్ రాష్ట్రానికి చెందిన నిబాకుమారి, శివనత్‌దాస్ దంపతులు తమ ముగ్గురు కుమారులతో కలిసి ఐదేళ్ల కిందట జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా నిబాకుమారి తన అన్నా, వదినలు బీహార్‌లోనే మృతి చెందగా వారి కుమార్తె ఆర్తీకుమారి(6)ని గత కొంతకాలంగా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆర్తీకుమారిపై మేనత్త నిబాకుమారి నిత్యం భౌతిక దాడి చేయడంతో పాటు సక్రమంగా అన్నం పెట్టక అనారోగ్యానికి గురైంది. చిన్నారిపై మేనత్త వేధింపుల విషయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న దళిత బహుజన రిసోర్స్ సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత కట్టుబడిపాలెం వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో గ్రామ మహిళా కానిస్టేబుల్ సాయంతో 108 అంబులెన్స్‌లో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అనిత జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు.


