భావితరాలకు తెలియజెప్పాలి..
గన్నవరం రూరల్: ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం కోరట బావి. దీనిలోని నీరు అమృతతుల్యమని ఏళ్లుగా ప్రతీక. మండలంలోని ముస్తాబాద తూర్పు భాగంలో కొండ పక్కన కోరట బావి శతాబ్దాల క్రితం గ్రామస్తుల దాహార్తిని తీర్చేది. ఈ బావి నీరు అత్యంత ప్రశస్తమైనదిగా భావించిన పూర్వీకులు మంచినీటి అవసరాల కోసం ఇక్కడి నుంచి నీటిని తీసుకుని వెళ్లేవారు. అంతేగాక సూరంపల్లి, ముస్తాబాద, పురుషోత్తపట్నం, కొండపావులూరు, గోపవరపుగూడెం గ్రామాల నుంచి రైతులు, మొకాసా దారులు ఈ నీటిని తీసుకువెళ్లేవారు. ఈ ప్రాంత రైతులు పొగాకును పండించేవారు. దొర పొగాకును ఉత్పత్తి చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా అప్పటి మద్రాసులో కంపెనీలు నిర్వహించేవారు. అక్కడికి ఈ కోరట బావి నీటిని వారు రైళ్లల్లో తీసుకు వెళ్లి మంచినీళ్లుగా వినియోగించటం జరిగేదని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ చెప్పుకుంటారు.
ఔషధగుణాలు..
కోరట బావి నీరు అమృతతుల్యమని భావిస్తారు. ఈ నీరు తాగితే మోకాళ్ల నొప్పులు రావని, తగ్గుతాయని చెప్పుకుంటారు. అంతేగాక దీర్ఘ రోగాలు తగ్గుతాయని భావిస్తారు. శతాబ్దాల ముస్తాబాద చరిత్రలో కోరట బావి పరిసరాల్లో సాధువులు, మహర్షులు బస చేసేవారని చెబుతారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి దీర్ఘకాల రోగులను ఇక్కడికి తీసుకువచ్చి నెలల తరబడి ఉంచి, కోరట బావి నీరు అందిస్తే వారి రోగాలు తగ్గి వెళ్లే వారని గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు.
కాలగర్భంలో కలిసిపోతూ..
అటువంటి చరిత్రగల కోరట బావి నీరు అడుగంటింది. కాలగర్భంలో కలసిపోయే విధంగా మొక్కలు అల్లుకుపోయాయి. 1965లో గ్రామానికి చెందిన యువక బృందం కోరట బావిని ఆధునికీకరించి అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు డాక్టర్ సీఎల్ రాయుడుతో ప్రారంభోత్సవం చేయించిన శిలాఫలకం నేటికి కనిపిస్తోంది. కోరట బావి నీరు అనంతర కాలంలో బావికి సమీపంలో ప్రభుత్వం హ్యాండ్ బోరు నిర్మించగా అక్కడ ఆ జల కనిపించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న పలు గ్రామాల ప్రజలు నిరంతరం కోరట బావి నీటిని ఈ హ్యాండ్ బోరు ద్వారా తీసుకువెళుతున్నారు. ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న కోరట బావి ప్రాంతాన్ని ప్రభుత్వం రక్షించాలని, దాని విశిష్టతను భావితరాలకు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కోరట బావి జల పాయ నుంచి హ్యాండ్ బోరు ద్వారా నీటిని తీసుకువెళుతున్న గ్రామస్తులు
చెట్ల వేళ్లతో పూడుకుపోయిన కోరట బావి
కోరట బావి చరిత్రను భావితరాలకు తెలియజేయాలి. అందుకు దీనిని సంరక్షించాలి. బాగు చేసి, చారిత్రక సంపదగా పరిగణించాలి. దీనిలోని నీరు ఔషధ గుణాలు కలిగినదిగా చెబుతారు. అందుకే ఇప్పటికీ పరిసరాల్లోని 5గ్రామాల ప్రజలు మంచినీటిని ఇక్కడి నుంచి తీసుకువెళతారు.
– షేక్ గోరా మస్తాన్, రైతు, ముస్తాబాద


