రెడ్డిగూడెం: మండలంలోని రంగాపురం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్. రమేష్‌బాబు(ఏపీసీ) మంగళవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని కిచెన్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, స్టాక్ రూమ్‌లను పరిశీలించారు. ఎస్‌వో, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థినులతో ముచ్చటించారు. జిల్లా కోఆర్డినేటర్ జీసీడీఓ, మండల విద్యాశాఖ అధికారి–2 పి. రమేష్‌బాబు, మండల ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (డీఈఈసెట్) నోటిఫికేషన్ విడుదలైనట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు రూ.1,000 ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు భారతీయ పౌరులు అయి ఉండాలని, ఇంటర్మీడియెట్ లేదా సమాన అర్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. సాధారణ వర్గాలకు కనీసం 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు అవసరమని తెలిపారు. అభ్యర్థులు కనీసం 17ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని సూచించారు. పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పార్ట్–ఏకు 60 మార్కులు (సాధారణ అంశాలు), పార్ట్–బీకు 40 మార్కులు (ఎంపిక చేసిన సబ్జెక్ట్) ఉంటా యన్నారు. ప్రభుత్వ డీఈఈటీ కళాశాలలు, ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ర్యాంక్ ప్రకారం సింగిల్ విండో విధానంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. హాల్ టికెట్లు, పరీక్ష తేదీలు తదితర వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్లలో వెల్లడిస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ పూర్తిగా చదవాలని, సరైన ఫొటో, వివరాలను మాత్రమే అప్‌లోడ్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://cse.ap.gov.in,https://apdeecet. apcfss.in వెబ్‌సైట్‌లను పరిశీలించాలని చెప్పారు.
రాష్ట్ర మంత్రి నారాయణ
పెనమలూరు: మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, డ్రెయినేజీలు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ కింద ఉన్న రోడ్లు నిర్మాణానికి రూ.103 కోట్లతో ఆయన మంగళవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రోడ్లు, డ్రెయిన్‌లు, వేస్ట్ ఎనర్జీ ప్లా్‌ంట్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. మొదటి దశగా అన్ని మునిసిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పన చేస్తామన్నారు. ఆ తరువాత పార్కులు, భవనాల నిర్మాణాలు, స్కూల్ ఏర్పాటుకు నిధులు ఇస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి శుభాష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు.
గుడివాడరూరల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30వేలు అపరాధ రుసుమును విధిస్తూ 11వ జిల్లా అదనపు జడ్జి జి.సుబ్రహ్మణ్యం తీర్పు వెల్లడించినట్లు గుడి వాడ తాలూకా ఎస్‌ఐ ఎన్.చంటిబాబు మంగళవారం తెలిపారు. మండలంలోని వలివర్తిపాడు గ్రామానికి చెందిన బల్లవరపు సుధాకర్, సిమ్మతి అనూషను 2013లో వివాహం చేసుకున్నాడు. వివాహం తదనంతరం అదనపు కట్నం కోసం సుధాకర్, అతని కుటుంబ సభ్యులు సుభాషిణి, సుధాంజలి, మేరమ్మ, భాస్కరరావు, ప్రభాకరరావు వేధించడంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు తన కుమార్తె మృతికి కారణమైన వారిపై తాలూకా పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తల్లి మరియమ్మ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన అప్పటి డీఎస్పీ విచారించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ పీపీ కంభంపాటి రవి సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు సమర్పించడంతో నేరం రుజువు అయ్యింది. దీంతో మృతురాలి ఆత్మహత్యకు కారణమైన భర్త సుధాకర్‌కు ఐపీసీ–306 సెక్షన్ ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేల అపరాధ రుసుము, 498ఐపీసీ కింద రెండేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధించారు.


