సొర్లగొంది నుంచి లైట్ హౌస్ వరకు వందకు పైగా కుటుంబాలు సముద్ర తీరంలో వెట్టి చాకిరి నుంచి ఎస్టీలకు విముక్తి ఏదీ? పలు జిల్లాల నుంచి యానాదులను తరలిస్తున్న పీతల వ్యాపారులు
నాగాయలంక మడ అడవుల మధ్య యానాదుల జీవనయానం.. కాలం మరిచిన గాథలా కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాదులకు అడవే వారి ఆశ్రయం.. ప్రకృతే ఆధారం. ఇతరుల కరుణపై ఆధార పడిన వీరికి పూట గడవాలంటే మాత్రం వెట్టి చాకిరీ తప్పడం లేదు. దీంతో అడవుల్లో చెట్ల నీడలో వీరు కన్నీరు పెట్టుకుంటున్నారు. పీతలు, రొయ్యలు, చేపల వ్యాపారుల చేతిలో వీరు ఉండటంతో.. జీవన పోరాటం చేయక తప్పడం లేదు.
నాగాయలంక: నాగాయలంక మండలంలోని మడ అడవుల్లో వందకు పైగా యానాది కుటుంబాలు మాడిపోతున్నాయి. పీతలు, రొయ్యలు, చేపలు సాగు చేసే రైతులు.. పనిలో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని యానాదులు వాపోతున్నారు. మండలంలోని తీరప్రాంతం సొర్లగొంది నుంచి లైట్ హౌస్ వరకు వందకు పైగా యానాది(ఎస్టీలు) కుటుంబాలు నిత్య జీవన యానంలో వెట్టి చాకిరీతో కునారిల్లుతున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి..
సరైన సీజన్ కాక పోయినా పీతల వేట కొనసాగించేందుకు సంబంధిత వ్యాపారులు వెట్టి చాకిరీ చేయించుకోవడానికి బందరు, బంటు మిల్లి, బాపట్ల, నెల్లూరు జిల్లాల ప్రాంతాల నుంచి యానాదులను నాగాయలంక తీర ప్రాంతానికి తరలిస్తున్నారు.
ఇక్కడ కృష్ణా నది పరీవాహకం, బంగాళాఖాతం సముద్ర పాయల వెంట పీతల వేటకు అను కూలంగా ఉంటుంది. దీంతో గంపగుత్తగా పీతల వ్యాపారం సాగించే వ్యాపారులు వీరిని చెప్పు చేతల్లో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
తరచూ తీర గ్రామాల్లో ఘర్షణ
వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి యానాదులను తీసుకొస్తున్నారు. దీంతో మండలంలోని స్థానిక యానాదుల జీవనోపాధికి గండి కొడుతున్నారు. పరాయి ప్రాంత ఎస్టీలను తీసుకురావడం తరచూ తీర గ్రామాల్లో ఘర్షణలకు తావిస్తోంది.
వసతుల్లేక అల్లాడుతున్నారు
సొర్లగొంది తీరంలో మడ అడవుల మాటున మండు వేసవిలో సరైన నివాసాలు, సౌకర్యాలు లేక పిల్లలతో అల్లాడుతున్నా వారిపై కనికరం ఉండదు. వ్యాపారుల లక్ష్యం వారు వేట సాగించి సరుకు అందించడమే. నామ మాత్రపు కూలీతో పని చేస్తున్నారు. యానాదుల పిల్లలు సైతం ఈ కఠిన జీవన యాత్రలో సమిధలు కావాల్సి వస్తోంది. వేసవిలో తాగునీరు అందదు, రాత్రిళ్లు తాత్కాలిక నివాస డేరాల్లో దోమలతో ఇక్కట్లు పడాల్సిందే. గ్రామాలకు దూరంగా మడ అడవుల్లో తీరం వెంట వారి జీవనం సాగుతోంది. స్థానికులైతే ఏరోజుకారోజు వేటకెళ్లి ఇళ్లకు తిరిగి వస్తుంటారు. ఇది లాభదాయకమైన వెట్టి చాకిరి కావడంతో ఈమధ్య కాలంలో పలువురు వ్యాపారులు ఎస్టీల వైపు చూస్తున్నారు.
ఇటీవల ఐదు కుటుంబాలకు విముక్తి
ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామానికి చెందిన పీతల వ్యాపారి నెలలు తరబడి దీవుల్లో యానాదుల (ఎస్టీలఉ)ను బంధించి వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్న తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఐదు కుటుంబాలకు చెందిన 15మందికి అధికారులు గత నెల 17న విముక్తి కలిగించారు. అంతకు ముందు ఈలచెట్టదిబ్బలో గ్రామ కమిటీకి వ్యాపారుల నడుమ ఘర్షణలు రచ్చకెక్కి కేసులు వరకు దారితీసిన విషయం తెలిసిందే.
నాగాయలంక మడ అడవుల్లో
మాడిపోతున్న యానాదుల జీవితాలు


