ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం చామంతులు, గులాబీలు, గన్నేరు పుష్పాలతో దుర్గమ్మకు విశేష పుష్పార్చన జరిగింది. తొలుత ఆలయ ఈఓ శీనా నాయక్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది అర్చన కోసం సేకరించిన పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అలయానికి చేరుకుని మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం నూతన పూజా మండపానికి చేరుకుని పుష్పాలను అర్చకులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో పాల్గొనడం వల్ల భక్తులకు మనశ్వాంతి, ఐశ్వర్యం, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేశారు.


