ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన సమాచారం తెలియజేయడానికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. దుర్గగుడి అభివృద్ధి పనులను కమిషనర్ శనివారం పరిశీలించారు. కనకదుర్గనగర్ నుంచి ప్రారంభమయ్యే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, లడ్డూ పోటు, అన్నదాన భవనం పనులను పరిశీలించారు. లోటుపాట్లను గుర్తించిన కమిషనర్ ఇంజినీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన సూచనలు పాటించకపోవడం సరికాదని, మళ్లీ తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దసరాకు పనులు ఓ కొలిక్కి రావాలని ఆదేశించారు. పనులపై ఆలయ ఈఈ–2 ఎల్.రమ కమిషనర్‌కు వివరించారు.
ఆలయ అధికారులతో సమీక్ష
అనంతరం కమిషనర్.. దుర్గగుడి అధికారులతో మూడు గంటలకు పైగా సమీక్షించారు. ఆలయ నిర్వహణ, భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆదేశించారు. వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్‌ను 50 శాతం పైగా జరిగేలా చూడాలన్నారు. ఇటీవల ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో వీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలాన్ని పూర్తిగా పార్కింగ్‌కు ఉపయోగించి అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో భక్తులను కొండపైకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, చైర్మన్, బోర్డు సభ్యులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సభ్యులు పాల్గొన్నారు.


