అవయవదానంతో ఇద్దరికి నూతన జీవితం
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు వృద్ధుల అవయవాల దానంతో మరో ఇద్దరికి నూతన జీవితాలు లభించాయి. గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు రోగులకు లివర్ మార్పిడి ఆపరేషన్లు చేసి జీవితాలను ప్రసాదించారు. కృష్ణా జిల్లాకు చెందిన సి.హెచ్.సుబ్బలక్ష్మి (61) గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో ఈ నెల ఎనిమిదో తేదీన అనా రోగ్యం బారిన పడి చేరగా, పదో బ్రెయిన్ డెడ్ అయింది. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన కడియం నాగమల్లేశ్వరి (60) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈ నెల ఎనిమిదో తేదీన గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో చేరింది. చికిత్సపొందుతూ ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయింది. ఇద్దరు వృద్ధుల కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. జీవన్‌ధాన్ ప్రతినిధులు అవయవదానం ప్రాముఖ్యత గురించి బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులను సంప్రదించ డంతో స్వచ్ఛందంగా అవయవదానం చేశారు. ఈ నేపథ్యంలో అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కాలేయ మార్పిడి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరికి వృద్ధుల నుంచి లివర్ సేకరించి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ విషయాన్ని శనివారం కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. లివర్ ట్రాన్స్‌ఫ్లాంటేషన్ సర్జన్ డాక్టర్‌వేణుగోపాల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీస్ట్ డాక్టర్ విష్ణుప్రసాద్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రతాప్ మౌళి, ఎనస్థీషియా డాక్టర్ కళ్యాణ్‌రామ్, రేడియాలజిస్ట్ డాక్టర్ యామిని, ఇంటర్వేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ వెంకటచౌదరి విజయ వంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు చేసినట్లు వైద్యులు వెల్లడించారు.


