బెజవాడలో ‘మిస్టర్ వర్క్ ఫ్రం హోం’ సందడి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని అనుసంధానిస్తే ఎలా ఉంటుందో వెండి తెరపై ‘మిస్టర్ వర్క్ ఫ్రం హోం’ చిత్రంలో ప్రేక్షకులకు చూపించనున్నామని హీరో త్రిగుణ్ తెలిపారు. వచ్చే వారం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని, ఆదరించాలని కోరారు. బెంజి సర్కిల్ సమీపంలోని ఒక హోటల్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో త్రిగుణ్ మాట్లాడుతూ.. తాను నటించిన ఈశా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారన్నారు. వ్యవసాయం కథాంశంతో మిస్టర్ వర్క్ ఫ్రం హోం చిత్రంతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వస్తున్నాని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన యువకుడు వ్యవసాయం ఎందుకు చేయాలనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ పాయల్, దర్శకుడు మధుదీప్, నిర్మాత అరవింద్ పాల్గొన్నారు.
కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో ఓ యువకుడు ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహం శనివారం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు కాలువ కట్టపై కూనపరెడ్డి బుజ్జిబాబు, అంజలి దంపతులు నివసిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు మహేష్ (24) ఉడ్ వర్కు కార్మికుడు, రెండో కుమారుడు రాకేష్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ నెల 23వ తేదీ ఉదయం మహేష్ తల్లిదండ్రులతో కలిసి ద్విచక్రవాహనంపై పనిమీద బయటకు బయలు దేరాడు. ఏలూరు కాలువ వంతెన వద్దకు రాగానే కాలి చెప్పు పడిపోయిందని చెప్పి ద్విచక్రవాహనంపై నుంచి దిగాడు. ఒక్కసారిగా వంతెనపై నుంచి కాలువలోకి దూకేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో బుజ్జిబాబు, అంజలి దంపతులు తల్లడిల్లారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు సమాచారం అందించగా, వారు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం పడవ సాయంతో గాలించగా వంతెనకు కొద్దిదూరంలో మహేష్ మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ ఆత్మహత్యకు గలకారణాలు తెలియాల్సి ఉంది.
టిప్పర్ ఢీకొని రైతు దుర్మరణం
జి.కొండూరు: టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన చెర్వుమాధవరం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. చెర్వుమాధవరం గ్రామానికి చెందిన రైతు చెన్నంశెట్టి సాంబశివరావు (60) ద్విచక్ర వాహనంపై శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. గ్రామ శివారులోకి రాగానే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వెట్‌మిక్స్ అన్‌లోడు చేస్తున్న టిప్పర్ ఎదురుగా ఉందని సాంబశివరావు రోడ్డుపై తన ద్విచక్రవాహనాన్ని నిలిపి, దారి కోసం వేచివున్నాడు. అన్‌లోడు పూర్తయిన తర్వాత ముందుకు వెళ్లాల్సిన టిప్పర్ వెనక్కి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. సాంబశివరావు టిప్పర్ వెనక టైర్లు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సాంబశివరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందు కున్న జి.కొండూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ప్రమా దానికి కారణమైన టిప్పర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తరచూ గ్రామంలో మితిమీరిన వేగంతో తిరుగుతుండడంతో రెండు రోజుల క్రితం గ్రామస్తులు అడ్డుకుని నెమ్మదిగా నడపాలంటూ డ్రైవర్‌ను హెచ్చరించారు. సాంబశివరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బెజవాడలో ‘మిస్టర్ వర్క్ ఫ్రం హోం’ సందడి


