సైకిల్‌పై కృష్ణా కలెక్టర్ పర్యటన
గూడూరు: కృష్ణా జిల్లా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం మచిలీపట్నం నుంచి సైకిల్ తొక్కుతూ గూడూరు వచ్చారు. గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు గ్రామ సచివాలయం–2 వద్ద మరుగుదొడ్ల నిర్మాణ పనులు, జెడ్పీ నిధులతో నరసింహస్వామి ఆలయం సమీపంలో నుంచి మారుతీనగర్ వరకు నిర్మించిన డ్రెయిన్లను పరిశీలించారు. దాదాపు కిలో మీటరు మేర నడిచి ఆ మార్గంలో ఇళ్ల యజమానులను చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి
కలెక్టర్ గ్రామ పర్యటన నేపథ్యంలో స్థానికులు తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కరించాలని అభ్యర్థించారు. ముక్కొల్లు రక్షిత నీటి పథకం నుంచి వస్తున్న నీరు బాగుండటం లేదని, తరకటూరు స్కీమ్ నుంచి సరఫరా చేయాలని కోరారు. గ్రామంలో అంతర్గత డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ బాలాజీ స్పందించి ముక్కొల్లు స్కీమ్ నుంచి వస్తున్న నీటి నాణ్యతపై అధికారులను ప్రశ్నించారు. ఫిల్టర్ బెడ్లకు మరమ్మతులు చేపట్టి నాణ్యమైన నీరు సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, జీరో గ్యాప్ శానిటేషన్ ఇతివృత్తంతో ఇంటింటా చెత్త సేకరణ, తడి చెత్త–పొడి చెత్త విభజన, ప్లాస్టిక్ రహిత పరిసరాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలన్న లక్ష్యంతో అవసరమైన వారికి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభురత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎంపీపీ సంగా మధుసూదనరావు, జెడ్పీటీసీ సభ్యుడు వేముల సురేష్ రంగబాబు, డీపీఓ జె.అరుణ, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నెల్సన్‌పాల్,సర్పంచి లింగం సులోచనారాణి, ఎంపీడీఓ పి.శైలజాకుమారి తదితరులు పాల్గొన్నారు.
సైకిల్‌పై కృష్ణా కలెక్టర్ పర్యటన


