బెజవాడకు దోమకాటు
దోమల నివారణ చర్యలు శూన్యం నెల రోజులుగా ప్రజలకు పాట్లు డెంగీ లక్షణాలతో రెండేళ్ల బాలిక మృతి పట్టించుకోని ప్రజారోగ్య విభాగం
కునుకు కరువు
డ్రెయిన్లే దోమలకు ఆవాసాలు
బెజవాడవాసులపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. నగరంలో ఏ వీధి చూసినా ఇదే సమస్య వెంటాడుతోంది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉండటమే ప్రధాన కారణం. దోమకాటు ప్రజారోగ్యానికి చేటు చేస్తోంది. దోమల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నెలరోజులుగా ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.
ప్రజారోగ్యానికి చేటు
‘మూడు రోజుల క్రితం కామినేనినగర్‌కు చెందిన రెండేళ్ల బాలిక హారిక డెంగీ లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందింది.’ ఇలా నగరంలో అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నారు.
కానరాని ఫాగింగ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు కుట్టిచంపుతుండటంతో విజయవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. డెంగీ, మలేరియా వంటివి సోకుతాయని ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో చలనం లేదు. దోమల నివారణకు చేయాల్సిన యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్‌లు కేవలం రికార్డులకే పరిమితం అవుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దోమకాటుకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.
దోమల కార్ఖానాలు ఇవే..
నగరంలో ప్రధానంగా నవరంగ్ థియేటర్ సెంటర్, బీసెంట్ రోడ్డు, చేపల మార్కెట్, బుడమేరు, కృష్ణలంక, పటమట, కరెన్సీనగర్, రామరప్పాడు, వన్ టౌన్, అవుట్‌ఫాల్ డ్రెయిన్లు, ప్రధాన కాల్వల గట్లు, బుడమేరు, ఖాళీ ప్రాంతాలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో దోమలు ఉత్పత్తి అయితే రెండు, మూడు కిలో మీటర్లు విస్తరిస్తాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో కానరాని చర్యలు
దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వీఎంసీ చెబుతున్నా క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. నగరంలో ఆరు మలేరియా డివిజన్లు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ డివిజన్ల వారీగా ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్ల కోసం 259 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయి. చాలామంది కార్మికులు విధులకు హాజరైనట్లు చూపి, మస్తరు వేయించుకొని వెళ్లేందుకు మలేరియా విభాగం అధికారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సహకరిస్తున్నారని తెలుస్తోంది. దీనికి అవుట్ సోర్సింగ్ సిబ్బంది నుంచి నెలకు రూ.5 నుంచి10 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొన్నిచోట్ల సూపర్‌వైజర్లదే పెత్తనం
వన్‌టౌన్‌లో ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్ విధులకు గైర్హాజరు అవుతూ ఓ సూపర్‌వైజర్‌తో కథ నడిపిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆ సూపర్‌వైజర్ అన్నీ తానై వర్కర్లతో బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇలాగే పలుచోట్ల కనిపిస్తోంది.
ఎంఎల్ ఆయిల్‌సైతం అదే రూటు
సైడ్, మైనర్, మేజర్ అవుట్‌ఫాల్, సైడు డ్రెయిన్లలో ఎంఎల్(మస్కిటో లార్వాసీడల్) ఆయిల్‌తో బాల్స్ వేయాల్సి ఉంది. దీనికి వీఎంసీ మలేరియా బృందాలకు ప్రతివారం 2 నుంచి 5 లీటర్ల ఎంఎల్ ఆయిల్ అందిస్తారు. దీన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిలిచిపోయిన డ్రోన్ స్ప్రే
ఏలూరు, బందరు, రైవస్ కాల్వలతో పాటు బుడమేరు గట్టులపై, కల్వర్టుల కింద ఉన్న మురుగునీరుపై, ఖాళీ స్థలాల్లో కార్మికులు వెళ్లలేని ప్రాంతాల్లో ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయడానికి వీఎంసీ వైఎస్సార్ సీపీ హయాంలో డ్రోన్లను వినియోగించింది. మురుగునీటిలో వ్యర్థాల తొలగింపునకు నీటిపై నడిచే టస్కర్ వాహనాన్ని వినియోగించారు. ఇప్పుడు వాటిని వినియోగించడం లేదు.
దోమలు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. కంటిపై కునుకు లేకుండా పోతోంది. చంటిపిల్లలు ఉన్న ఇంటిలో సమస్య తీవ్రంగా ఉంది. ఇంటిలో దోమలు రాకుండా భద్రత చర్యలు తీసుకుంటున్నాం. సాయంత్రమైతే ఇంటి తలుపు తీయాలంటే భయపడుతున్నాం.
–కలకోట ఉమామహేశ్వరరెడ్డి,
అయ్యప్పనగర్
కాలువల్లో సిల్టు తీయడం లేదు. సైడు డ్రెయిన్లు దోమలకు ఆవాసాలుగా మారాయి. ఎప్పుడైనా పూడిక తీసినా దానిని అక్కడే వదిలేస్తున్నారు. వీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు.
–శ్రీలక్ష్మి, పటమట
దోమల నియంత్రణకు ఏటా వీఎంసీ రూ. 15 కోట్లు నిధులు వెచ్చిస్తోంది. ఇందులో ఎంఎల్ ఆయిల్, పైరత్రం, ఫాగింగ్‌కు ఖర్చు చేస్తున్నారు. డివిజన్ల వారీగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు బాధ్యులుగా రోజుకు ఇద్దరు/ ముగ్గురు సభ్యుల బృందం డివిజన్లలో ఫాగింగ్ చేయాలి. అందుకు వీఎంసీ ప్రతిరోజూ ఒక్కో బృందానికి 80 లీటర్ల డీజిల్‌ను పైరత్రంలో కలిపేందుకు వీఎంసీ అందిస్తుంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పూర్తిస్థాయిలో చేయకుండా 10 ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తున్నట్లు డీజిల్ తీసుకొని, వీరు ఐదు చోట్ల మాత్రమే చేసి, మిగిలిన ఆయిల్ అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బెజవాడకు దోమకాటు
బెజవాడకు దోమకాటు
బెజవాడకు దోమకాటు


