సేవల్లో వైఫల్యం
నిరాశ పరుస్తున్న రైతు సేవా కేంద్రాలు
చిలకలపూడి(మచిలీపట్నం): పేరుకే రైతు సేవా కేంద్రాలు.. అంత చేస్తాం ఇంత చేస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు సర్కార్ వైఫల్యం సేవల్లో అందించే అంశంలో స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో రైతులకు వారి ముంగిటే సేవలు అందించాలని గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఎంతో చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులను నిరాశ పరిచింది. ఇందులో భాగంగా రేషనలైజేషన్ పేరుతో రైతు సేవా కేంద్రాలను కుదించి సిబ్బందిని కూడా తగ్గించారు. గత ప్రభుత్వంలో ఈ కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో పాటు సాగుకు సూచనలు, సలహాలు ఇవ్వటమే కాకుండా అడుగడుగునా అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అందించే సేవలను ప్రహసనంగా మార్చింది
సిబ్బంది తగ్గి.. సేవలు అందక
గత ప్రభుత్వం జిల్లాలో 385 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషనలైజేషన్ పేరుతో రెండు, మూడు సేవా కేంద్రాలను కలిపి ఒకటిగా సర్దుబాటు చేశారు. దీంతో ఈ కేంద్రాల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 314 రైతు సేవా కేంద్రాలు పని చేస్తున్నాయి. 89 రైతు సేవా కేంద్రాలకు తాళాలు వేశారు. రేషనలైజేషన్ ద్వారా చాలా మంది సిబ్బంది తగ్గిపోయి ప్రస్తుతం సేవలు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 300 మంది గ్రామ వ్యవసాయ సహాయకులు, 18 మంది గ్రామ ఉద్యాన సహాయకులు మాత్రమే పనిచేస్తున్నారు. గతంలో 385 మంది గ్రామ వ్యవసాయ సహాయకులు, 22 మంది ఉద్యానశాఖ సహాయకులు ఉండేవారు. దీంతో రైతులు గత ప్రభుత్వంలో గ్రామంలోనే ఎన్నో సేవలు అందుకున్నామని చంద్రబాబు సర్కార్ వచ్చిన తరువాత రేషనలైజేషన్ పేరుతో సేవలు సరిగా అందడం లేదని వారు వాపోతున్నారు.
సీఎం చంద్రబాబుకు వ్యవసాయ రంగం అంటే గిట్టదు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా బియ్యం సాగుచేయొద్దు బియ్యం తింటే షుగర్ వస్తుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రైతులకు ఎన్నో విధాలా సేవలందించిన రైతు భరోసా కేంద్రాలను పట్టించుకోవడం లేదు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ఈ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది.
–సింహాద్రి రమేష్‌బాబు,
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అవనిగడ్డ
రైతుసేవా కేంద్రాలను రేషనలైజేషన్‌తో కుదించడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వేరే గ్రామాలకు వెళ్లి రైతులు ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవాల్సి వస్తోంది. గతంలో అదే గ్రామంలో ఉండటంతో ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్లి తీసుకునేవారు. ప్రస్తుతం వేరే గ్రామానికి వెళ్లటంతో సమయం వృథా కావటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
–పంచకర్ల రంగారావు,
కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి
సేవల్లో వైఫల్యం
సేవల్లో వైఫల్యం
సేవల్లో వైఫల్యం


