భక్తజన కీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీపంచమి పర్వదినాన దుర్గమ్మను సరస్వతిదేవి అలంకారంలో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే రద్దీ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరావడంతో రూ. 300, రూ. 100 టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. అన్ని క్యూలైన్లలో ఉచితంగా అనుమతించడంతో భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కలిగింది.
ఆరో అంతస్తులో పూజలు, సామూహిక అక్షరాభ్యాసాలు
మహా మండపం ఆరో అంతస్తులో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరో అంతస్తులోనే సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించగా, సుమారు 500 మంది పైబడి చిన్నారులతో తల్లిదండ్రులు అక్షరాలను దిద్దించారు. చిన్నారులకు దేవస్థానం తరఫున పలక, బలపాలతో పాటు అమ్మవారి ప్రసాదాలను అందించారు. విద్యార్థులకు దేవస్థానం పెన్ను, కంకణం, కుంకుమ, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆర్జిత సేవలకు డిమాండ్
అమ్మవారి అన్ని ఆర్జిత సేవలకు శుక్రవారం డిమాండ్ కనిపించింది. నూతన యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో సుమారు 150 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చనకు సైతం 31 టికెట్లను దేవస్థానం విక్రయించింది. శ్రీచక్రనవార్చనకు 20 టికెట్లు, పల్లకీ సేవ, పంచహారతుల సేవ, శాంతి కళ్యాణం వంటి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.
భక్తజన కీలాద్రి


