గంజాయి ముఠా గుట్టు రట్టు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో గంజాయి ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కిలోల కొద్దీ అక్రమంగా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పట్టుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు శనివారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నఅవుట్‌పల్లి సమీపంలోని మధుఖాన్ కటింగ్‌కు దగ్గరలో ఇద్దర వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు ఈ నెల 23వ తేదీన పోలీసులకు సమాచారం అందింది. దీంతో హనుమాన్‌జంక్షన్ సీఐ ఎల్.రమేష్ ఆధ్వర్యంలో ఆత్కూరు ఎస్‌ఐ మూర్తి, ఈగల్ టీం సిబ్బంది కలిసి అదే రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో గంజాయి స్మగ్లర్‌లను పట్టుకునేందుకు వాహనాల తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన హనుమంతుదుర్గాప్రసాద్, కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన సయ్యద్ ముబారక్ వ్యాన్‌లో వెళ్తూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని గమనించిన సీఐ రమేష్, ఎస్‌ఐ మూర్తి వెంబడించి పిన్నమనేని ఆస్పత్రి సమీపంలోని గంగానమ్మగుడి వద్ద అడ్డు కుని వ్యాన్‌ను సోదా చేయగా రూ.కోటికి పైగా విలువైన 171.2 కిలోల గంజా యిని ప్యాకెట్లను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని, గంజాయి తరలిస్తున్న వ్యాన్‌ను స్టేషన్‌కు తరలించారు. అనకాపల్లికి చెందిన మరో వ్యక్తి తమతో ఈ పని చేయిస్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. తాము వైజాగ్ నుంచి కర్ణాటకకు గంజాయి తీసుకెళ్తే మూడో వ్యక్తి అక్కడ సరుకు తీసుకుంటాడని వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అనకాపల్లికి చెందిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. గంజాయి పట్టుకున్న సీఐ రమేష్, ఈగల్ టీం సీఐ ఎం.రవీంద్ర, ఎస్‌ఐ మూర్తిలతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


