కృష్ణానదిలో ఈతకు వెళ్లి బాలుడి గల్లంతు
కృష్ణలంక(విజయవాడతూర్పు): సరదాగా ఈతకు వెళ్లి ఓ బాలుడు కృష్ణానదిలో గల్లంతైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పాయకాపురం, న్యూరాజీవ్‌నగర్‌కు చెందిన పొనగంటి ఈశ్వరరావు కుమారుడు గణేష్ మణికంఠ (14) అదే ప్రాంతంలోని రాజీవ్ గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం నుంచి స్కూల్‌కు సెలవు కావడంతో మణికంఠ, అదే ప్రాంతానికి చెందిన తన ఐదుగురు స్నేహితులు కృష్ణానదిలో ఈత కొట్టేందుకు మూడు సైకిళ్లపై కృష్ణావేణి ఘాట్ వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శనైశ్వరస్వామి స్వామి గుడి వెనుక వైపు కృష్ణానదిలోకి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్లి ఆరుగురూ నీటిలోకి దిగారు. మణికంఠ నదిలో ఈత కొడుతూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి మునిగిపోయాడు. దీంతో మిగిలిన ఐదుగురు భయపడి బయటకు వచ్చి పెద్దగా కేకలు వేశారు. స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిపడేంతవరకు గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. మణికంఠ నదిలో గల్లంతయ్యాడన్నా విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.


