ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరిగే దిశగా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహద పడతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గుణదలలోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఆవరణలో ఏర్పాటైన రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. సిద్ధాంత పరమైన సమస్యల పరిష్కారానికి ఆలోచనా సామర్థ్యం పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉండే ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటిని ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు. ఆధునిక ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అందరూ విజేతలే..
కుమ్మరి శాలివాహన వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. ఈశ్వర్ మాట్లాడుతూ ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగస్వాములైన విద్యార్థులంతా విజేతలేనని తెలిపారు. ఈ ప్రదర్శనలో సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, హరిత ఇంధనం, గణిత వినోదం, జల వనరుల నిర్వహణ, వంటి అంశాలను ప్రదర్శించారన్నారు. డీఈఓ ఎల్. చంద్రకళ, పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ వరప్రసాద్, ఎగ్జామినేషన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ కమీషనర్ రాంబాబు, పాఠశాల హెచ్‌ఎం సిస్టర్ షైనీ థామస్ తదితరులు పాల్గొన్నారు.


