పరిశ్రమల కల్పనపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఆయన చాంబర్‌లో జేసీ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి పరిశ్రమల పురోగతిపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఐఐసీ ద్వారా రెండేళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని దాదాపు 400 మంది పారిశ్రామికవేత్తల జాబితా తయారుచేసి వారి యూనిట్లు వెంటనే నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 30న సమావేశం నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ఇంకనూ పరిశ్రమలు నెలకొల్పని వారికి ఎందుకు వాటిని రద్దు పరచకూడదో తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర పథకాల అమలుపై అసంతృప్తి..
కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథకాల అమలులో పురోగతి సరిగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద బ్యాంకులలో 39 దరఖాస్తులు ఎటువంటి పురోగతి లేకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంట నే పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖర్, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, బీఎస్ హేలా షారోన్, డీఆర్డీఏ పీపీడీ శివప్రసాద్, డ్వామా పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


