వీఆర్వోల సమస్యల పరిష్కారానికి డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు కోరారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్ర రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వన్ టైం సెటిల్‌మెంట్ కింద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అర్హులతో భర్తీ చేయాలన్నారు. అర్హులైన గ్రేడ్–2 వీఆర్వోలకు గ్రేడ్ –1, వీఆర్వోలుగా వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు అందరికీ కామన్ డీడీఓగా తహసీల్దార్లు ఉండేలాగా ఆదేశానివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఒకే డిపార్ట్‌మెంట్ కింద..
వీఆర్వోలు అందరూ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కింద జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తారని, ఇతర శాఖల అధికారులు జారీ చేసిన ఆదేశాలు పాటించడం సాధ్యం కాదని రవీంద్రరాజు అన్నారు. బయోమెట్రిక్ విషయంలోనూ జీఎస్‌డబ్ల్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలు అమలు సాధ్యం కాదన్నారు. వీఆర్వోలు ఈ–ఆఫీసు ద్వారా ఫైల్స్ పంపేందుకు వీలుగా కంప్యూటర్ సౌకర్యం కల్పించాలన్నారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ పేరుతో వీఆర్వోల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆర్టీజీఎస్ అధికారులు చేస్తున్న చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఏపీ గవర్నమెంట్ రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేసి పనిచేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి మౌళి భాష, గ్రామ సహాయకుల రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దన్న, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు, గ్రేటు–2 వీఆర్వో అసోసియేషన్ నాయకులు శ్యామ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


