ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం, మార్గశిర అమావాస్య నేపథ్యంలో ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, చండీహోమం, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన సేవ జరిగాయి. నూతన యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో 201 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 క్యూలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమావాస్య నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి దర్బారు సేవ, పల్లకీ సేవ, పంచహారతుల సేవలను నిర్వహించారు.
రేపు హిందూ ఆత్మీయ సమ్మేళనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలో ఎన్టీఆర్ కాలనీ 4వ లైన్‌లోని మలినేని నాగేశ్వరరావు గ్రంథాలయ హాలులో ఈ నెల 21వ తేదీ హిందూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ కాలనీ బస్తీ ప్రతినిధి తరుణ్ కాకాని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యఅతిథిగా తాడేపల్లిలోని శివకేశవ పీఠం సంస్థాపక అధ్యక్షుడు మాతా శివానంద సరస్వతి, ముఖ్యవక్తగా ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర ప్రాంత కార్యకారిణి సదస్యులు పాకాల త్రినాథ్ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. హిందువులు కుటుంబ సమేతంగా ఉదయం 8.30 గంటలకు జరిగే సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు.
కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో ప్రయోగాత్మక స్టాపేజ్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు రైల్వే మంత్రిత్వశాఖ మచిలీపట్నం–విశాఖపట్నం, విశాఖపట్నం– కడప రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో ప్రయోగాత్మకంగా స్టాపేజ్ ఇచ్చింది. మచిలీపట్నం–విశాఖపట్నం (17219) రైలు అర్ధరాత్రి 1.13 గంటలకు కొవ్వూరు చేరుకుని 1.15 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైలు మధ్యరాత్రి 1.23 గంటలకు చేరుకుని, 1.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం–కడప (18521) సాయంత్రం 5.23 గంటలకు కొవ్వూరు చేరుకుని, 5.25 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో కడప–విశాఖపట్నం (18522) ఉదయం 5.04 గంటలకు కొవ్వూరు చేరుకుని, 5.05 గంటలకు బయలుదేరుతుంది.
22న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్
మచిలీపట్నంఅర్బన్: జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ – 2025 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా సైన్స్ అధికారి మొహమ్మద్ జాకీర్ అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లో ముందుగా మండల స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలు నిర్వహించామని తెలిపారు. మండల స్థాయిలో నిర్దేశించిన ఏడు థీమ్‌లలో ప్రథమ స్థానంలో నిలిచిన ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఒక ఉపాధ్యాయుడిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రతి మండలం నుంచి ఎనిమిది చొప్పున మొత్తం 200 ప్రదర్శనలు ఉంటాయన్నారు. వాటినుంచి అత్యుత్తమంగా ఎంపికయ్యే 11 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక చేస్తామని తెలిపారు.
డివైడర్ ఎక్కి బోల్తా కొట్టిన కారు
కృష్ణలంక(విజయవాడ తూర్పు): డివైడర్ ఎక్కి కారు బోల్తా కొట్టిన ఘటన కనకదుర్గ వారధి ఫ్లై ఓవర్ వద్ద జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జి.కొండూరుకు చెందిన నాగభూషణం కారు డ్రైవర్. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అతను మైలవరంలో సమీప బంధువులైన ఇద్దరు మహిళలను కారులో ఎక్కించుకుని కంకిపాడులో శుభకార్యానికి వెళ్లారు. అతను అక్కడే మద్యం సేవించాడు. తిరిగి సాయంత్రం బంధువులను కారులో ఎక్కించుకుని బెంజిసర్కిల్ నుంచి కృష్ణలంక హైవే మీదుగా మైలవరం బయలుదేరాడు. సుమారు సాయంత్రం 6.30 గంటలకు రాణిగారితోటలోని కోదండ రామాలయం సమీపానికి చేరుకోగానే మద్యం మత్తులో ఉన్న అతను గుంటూరు వైపునకు వెళ్లే ప్లైఓవర్‌పైకి వెళ్లి డివైడర్‌ను ఎక్కించాడు. కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు సీట్‌బెల్టు ధరించడంతో చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును పక్కకు తీసి వివరాలు సేకరించారు. అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై భక్తజన కోలాహలం


