గాంధీ పేరును తొలగించడం దుర్మార్గం
వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి గాంధీజీకి బీజేపీ కూటమి ఇచ్చే గౌరవం ఇదేనా..? కార్మికులకు అండగా ఉంటాం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహాత్మాగాంధీ పేరుతో ఉన్న వాటిని బీజేపీ కూటమి ప్రభుత్వం తొలగించడం సరికాదని వైఎస్సార్ సీపీ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని వైఎస్సార్ సీపీ ట్రేడ్‌యూనియన్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(వీబీ–జీ రామ్ జీ )గా మార్చడం దుర్మార్గం అన్నారు. బీజేపీ కూటమి జాతిపిత మహాత్మా గాంధీజీకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ, కూటమి నాయకుల్లో గాడ్సే రక్తం ప్రవహిస్తోందన్నారు.
కార్మిక చట్టాలను విస్మరిస్తున్నారు
కార్మిక వర్గాలపై కూటమి ప్రభుత్వం సిగ్గుమాలిన పనులు చేస్తోందని.. కార్మిక చట్టాల్ని విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ విధానం తప్పని తెలిపారని.. టీడీపీ ఎంపీలు నోరు మెదపలేదని దుయ్యబట్టారు.
ఉపాధిపై చంద్రబాబు ఎందుకు
చర్చించడం లేదు
ప్రతివారం జోలె పట్టుకొని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వందల కోట్లు తెచ్చుకుంటున్నారన్నారు. చంద్రబాబు గ్రామీణ ఉపాధి పథకం గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. కార్మిక వర్గాల జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారని.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. గ్రామీణ ఉపాధి పథకం తీసి వేస్తే వారికి నిరుద్యోగ భృతి ఇస్తారా అని ప్రశ్నించారు. కార్మికుల హక్కులు కాలరాస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలై 12 గంటల పని విధానం తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికులందరికీ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అండగా ఉంటుందని గౌతంరెడ్డి హామీ ఇచ్చారు.


