నకిలీ సిగరెట్ల దందా! | - | Sakshi
Sakshi News home page

నకిలీ సిగరెట్ల దందా!

Dec 20 2025 9:16 AM | Updated on Dec 20 2025 9:16 AM

నకిలీ

నకిలీ సిగరెట్ల దందా!

ఉమ్మడి జిల్లాలో జోరుగా అమ్మకాలు

లక్షలాది రూపాయల పన్నులు ఎగవేత

తెలిసినా పట్టించుకోని

వాణిజ్యపన్నులశాఖ!

ఇటీవల వివిధ ప్రాంతాల్లోని ట్రాన్స్‌

పోర్ట్‌లో దొరికిన సిగరెట్ల లోడ్లు

కోటిన్నరకు పైగా సరుకును

సీజ్‌ చేసినట్లు ప్రచారం

నామమాత్ర జరిమానాతో సరి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగుతోంది. బెజవాడ కేంద్రంగా అక్రమ పద్ధతుల్లో సిగరెట్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారం మేరకు ట్రాన్స్‌పోర్టుల్లో దాడి చేసి భారీగా సరుకును స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.

దాడుల్లో భారీగా దొరికిన

సిగరెట్ల లోడు

కొందరు అక్రమార్కులు వివిధ పద్ధతుల్లో విదేశీ సిగరెట్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే నకిలీ సిగరెట్లను బెజవాడకు తీసుకువస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని విజయవాడ డివిజన్‌–1, విజయవాడ డివిజన్‌–2, విజయవాడ డివిజన్‌–3 పరిఽధిల్లోని వివిధ ట్రాన్స్‌పోర్టుల్లో ఇటీవల అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ డివిజన్‌–1 పరిధిలో భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లోని ట్రాన్స్‌పోర్టుల్లో, విజయవాడ డివిజన్‌–2 పరిధిలోని రాజారంగయ్యప్పారావు వీధిలోని మరో ట్రాన్స్‌పోర్టులో, విజయవాడ డివిజన్‌–3 పరిధిలోని తోట్లవల్లూరు రోడ్డులో ఉన్న మరో ట్రాన్స్‌పోర్టులో భారీగా నకిలీ, విదేశీ సిగరెట్లను భారీ లోడులను స్వాధీనం చేసుకున్నారు.

విచ్చలవిడిగా..

ఉత్తరాది రాష్ట్రాల నుంచి, నేపాల్‌ వంటి దేశాల నుంచి నకిలీ కంపెనీల సిగరెట్లను నగరానికి తీసుకొచ్చి ఇక్కడ దుకాణాలకు అక్రమార్కులు విక్రయిస్తున్నారని విజిలెన్స్‌ విభాగంలో గతంలో పని చేసిన అధికారులు చెబుతున్నారు. సాధారణ కంపెనీల సిగరెట్లతో పాటుగా వీటిని ఆయా కంపెనీల రకాలతో కలిపి విక్రయిస్తుండటంతో చిరువ్యాపారులకు సైతం తెలియకుండా ఇవి వినియోగదారులకు చేరిపోతున్నాయి.

దాడుల్లో తప్ప.. మామూలుగా

పట్టుకోవడం లేదు

ఏడాది క్రితం రామవరప్పాడులోని ఒక గోడౌన్‌లో ఉంచిన సుమారు రెండు కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కేంద్ర ప్రభుత్వ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని సెంట్రల్‌ జీఎస్టీ అధికారులు, కస్టమ్స్‌ కమిషనరేట్‌ సిబ్బంది ఆ సరుకును స్వాధీనం చేసుకొని గుంటూరు తరలించారు. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా ట్రాన్స్‌పోర్టులపై దాడులు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆయా డివిజన్లు, సర్కిల్‌ పరిధుల్లో ఉన్న అధికారులకు ఎవరు ఎటువంటి వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నది స్పష్టంగా తెలిసినా ఆ వైపుగా దృష్టి పెట్టడం లేదు. వారి నుంచి వచ్చే ముడుపుల కారణంగానే అధికారులు, సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జరిమానాలపై

సర్వత్రా అనుమానాలు

ఉమ్మడి జిల్లాలో ఇటీవల జరిగిన తనిఖీల్లో సుమారుగా కోటిన్నరకు పైగా సిగరెట్ల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. సాధారణంగా బయట దేశాల నుంచి వచ్చే సిగరెట్లపై 28 శాతం పన్ను శాతంగా నివేదికలు చెబుతున్నాయి. దాని ప్రకారం దొరికిన సరుకుకు సుమారుగా పన్ను, జరిమానా కలిపి మొత్తం సుమారుగా కోటి వరకూ ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ కేవలం నామమాత్రంగా పన్ను, జరిమానాలను చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ సంబంధిత వ్యక్తికి నోటీస్‌లు జారీ చేసింది. అయితే దానికి సైతం అతను కట్టనంటూ ఎదురుతిరిగినట్లు సమాచారం. తొలుత భారీగా సరుకు పట్టుకున్నామని ప్రచారం జరగటం, తరువాత నామమాత్రంగా జరిమానా విధించటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అధికారుల కన్నుసన్నల్లోనే ఈ అక్రమ దందాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయని ఒకరిద్దరు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

సిగరెట్ల దందాపై దృష్టి పెడుతున్నాం

సిగరెట్ల విక్రయాలు చేసే వ్యక్తులపై దృష్టి పెడుతున్నాం. కొంతమంది ఎన్నిసార్లు దొరికినా తిరిగి ఇదే వ్యాపారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై మా అధికారులను అప్రమత్తం చేస్తాం. అడ్డదారుల్లో నగరానికి వచ్చే సిగరెట్లను పట్టుకోవటానికి చర్యలు చేపడుతున్నాం. రానున్న కాలంలో ఈ దాడులను ఉధృతం చేస్తాం.

–ప్రశాంత్‌కుమార్‌,

జాయింట్‌ కమిషనర్‌, వాణిజ్య పన్నుల శాఖ,

విజయవాడ డివిజన్‌–1

నకిలీ సిగరెట్ల దందా! 1
1/1

నకిలీ సిగరెట్ల దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement