డీఆర్‌ఎం కప్ టోర్నమెంట్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో తొమ్మిదవ డీఆర్‌ఎం కప్ ఇంటర్ డిపార్ట్‌మెంట్ స్పోర్ట్స్ మీట్–2025 విజయవాడ రైల్వే స్టేడియం, రాయనపాడు వ్యాగన్ వర్కుషాపులో ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథి డీఆర్‌ఎం, దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహిత్ సోనాకియా రాయనపాడు చీఫ్ వర్క్‌షాపు మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఏడీఆర్‌ఎంలు కొండా శ్రీనివాసరావు, పీఈ ఎడ్విన్, డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్, సీనియర్ డీఓఎం ఎం.దినేష్‌కుమార్‌తో కలసి పోటీలను ప్రారంభించారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, మహిళలకు త్రోబాల్, టెన్నికాయిట్, 50 ఏళ్ల లోపు, పైబడిన కేటగిరిలో పురుషులు, మహిళలకు అథ్లెటిక్స్‌లో 100 మీటరు 200 మీటర్లు లాంగ్ జంప్, షాట్‌ఫుట్‌లలో ఉద్యోగులు పోటీపడనున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 200 మంది మహిళా ఉద్యోగులు మొదటి సారిగా పోటీల్లో పాల్గొనడం లింగ వివక్షలేని సమాజానికి నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి క్రీడలు ఉద్యోగుల్లో ఐక్యత, సమాన అవకాశాలను ప్రోత్సహించడంలో డివిజన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
గత ఏడాదిలో డివిజన్‌లోని 15 విభాగాల నుంచి 240 మంది ఉద్యోగులు పాల్గొనగా, ఈ ఏడాది 17 విభాగాల నుంచి 650 మంది ఉద్యోగులు పాల్గొనేందుకు ముందుకు రావడం శుభపరిణామన్నారు. ఈ పెరుగుదల రైల్వే ఉద్యోగుల్లో క్రీడలు, ఫిట్‌నెస్, జట్టు సమష్టి కృషి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


