వేర్వేరు చోట్ల గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యం
కృష్ణలంకలో కలకలం
కృష్ణలంక(విజయవాడతూర్పు): వేర్వేరు చోట్ల గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యమైన ఘటన కృష్ణలంక ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంక 22వ డివిజన్‌లోని సత్యంగారి హోటల్ సెంటర్‌లో పాత పోస్టాఫీస్ రోడ్డు మొదట్లో నిచ్చెనల తయారీ వెనుక వైపు ఒక పురుష మృతదేహం ఉన్నట్లు శుక్రవారం ఉదయం 10 గంటలకు సమాచారం అందింది. పాత పోస్టాఫీస్ రోడ్డు ఎదురుగా హైవే వెంట కర్మల భవన్ పక్కన ఉన్న బస్టాప్‌లో మరో మగ మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పాత పోస్టాఫీస్ రోడ్డు మొదట్లో ఉన్న మృతదేహం పక్కన ఒక కవర్‌లో మద్యం క్వార్టర్ బాటిల్, డబ్బులు, సిగరెట్ పెట్టె ఉన్నాయి. గురువారం రాత్రి పక్కనే ఉన్న వైన్ షాపులో మద్యం క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి సేవించడానికి అక్కడ కూర్చొని ఉండవచ్చని, గుండెపోటు రావడంతో మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
బస్టాప్ వద్ద మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తుండటంతో రెండు రోజుల క్రితం మృతి చెంది ఉండొచ్చని తెలిపారు. స్థానికులను విచారణ చేసి మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు యాచకులుగా పోలీసులు నిర్ధారించారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని నగరపాలక సంస్థ సిబ్బందికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
వేర్వేరు చోట్ల గుర్తు తెలియని రెండు మృతదేహాలు లభ్యం


