ఎస్‌జీ అండర్–17 క్రికెట్ చాంపియన్ విశాఖపట్నం
విజయవాడరూరల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్న జెడ్పీ హైస్కూల్ ఆధ్వర్యాన మూడు రోజులపాటు గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ అండర్–17 బాలుర క్రికెట్ చాంపియన్‌షిప్‌ను విశాఖపట్నం జిల్లా జట్టు కై వసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో విశాఖ జట్టు శ్రీకాకుళంపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజులపాటు 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొనగా శుక్రవారం టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో విశాఖపట్నం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచు కుంది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కెప్టెన్ అవినాష్ కేవలం 19 బంతుల్లోనే ఆరు ఫోర్లు, భారీ సికర్స్‌తో 39 పరుగులు చేశాడు. శ్రీకాకుళం బౌలర్ సాహిల్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పరుగుల ప్రవాహాన్ని నియంత్రించాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు విశాఖ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆరు వికెట్ల నష్టానికి 71 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ జోగేంద్ర 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. విశాఖపట్నం బౌలర్లు శ్రీరామాంజనేయులు, సాకేత్ అద్భుతంగా రాణించి చెరో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ కార్యదర్శి, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చాంపియన్స్ విశాఖపట్నం, రన్నరప్ శ్రీకాకుళం, మూడవ స్థానంలో నిలిచిన తూర్పు గోదావరి జిల్లాకు ట్రోఫీలను అందజేశారు. ప్రిన్సిపాల్ ఎన్.గోపాలకృష్ణ, టోర్నమెంట్ పరిశీలకుడు వి.భూపాల్‌రెడ్డి, స్కూల్ గేమ్స్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, కృష్ణా జిల్లా కార్యదర్శి గంపా రాంబాబు, ఎంపిక కమిటీ సభ్యులు వ్యక్తిగత పతకాలు అందజేశారు.


