వంశీని పలకరించారని టీడీపీ వారిపైనే దాడి
రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వర్గీయులు
గన్నవరం: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ వల్లభనేని వంశీమోహన్‌ను పలకరించినందుకు టీడీపీ వారిపైనే దాడి చేశారు. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెం గ్రామంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని పరామర్శించేందుకు వల్లభనేని వంశీ ఆదివారం మర్లపాలెం వెళ్లారు. ఆయనను టీడీపీకి చెందిన కంభంపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఇది జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు కంభంపాటి సాయి, శేషు, జాస్తి మురళి ఆదివారం రాత్రి గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న శ్రీధర్‌పై అకారణంగా దాడి చేశారు. తనపై ఎందుకు దాడి చేశారని అడిగేందుకు బంధువైన కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి శ్రీధర్ గ్రామంలోని సాయి ఇంటికి వెళ్లగా... మరోసారి సాయి, శేషు, జాస్తి మురళీతో పాటు విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హాకీ స్టిక్స్, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో శ్రీధర్ తలకు, రామ్మోహన్‌రావు చేతికి బలమైన గాయాలయ్యాయి. వారిని బంధువులు వెంటనే చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శ్రీధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, తాను 20 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నానని, గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు విజయం కోసం పని చేశానని శ్రీధర్ తెలిపారు. ఎన్నికల అనంతరం యార్లగడ్డ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ తమను దూరం పెట్టారని చెప్పారు. తమ సమీప బంధువుల ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీని పలకరించాననే కక్షతో యార్లగడ్డ వర్గీయులు అమానుషంగా దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్‌రావును సోమవారం వల్లభనేని వంశీ పరామర్శించారు.


