చల్లపల్లిలో కారు బీభత్సం
జనంపైకి దూసుకెళ్లిన కారు ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
చల్లపల్లి: కారు అదుపు తప్పి జనంపైకి దూసుకుపోవటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చల్లపల్లి పోలీస్టేషన్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే సాయంత్రం 5 గంటల సమయంలో సంతబజారు వద్ద చల్లపల్లి–మచిలీపట్నం రహదారి నుంచి పోలీస్టేషన్ రోడ్డులోకి కారు మలుపు తిరిగింది. ఇంతలోనే కారు ఒక్కసారిగా వేగం పుంజుకుని అప్పుడే పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాయనమ్మ, మనవరాలు కూతాటి నాగమల్లేశ్వరి, కూతాటి జెనీలియాలను ఢీ కొట్టి, అదే వేగంతో వెళ్తూ చల్లపల్లికి చెందిన గెల్లి రాధాకృష్ణను ఢీకొంది. మరికొంత దూరం ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందున్న మండపం వద్ద మరొక వ్యక్తిని ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి జెనీలియా, నాగమల్లేశ్వరి, రాధాకృష్ణలను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయాకు, నాగమల్లేశ్వరికి బలమైన గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జెనిలీయా పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ స్టేషన్ వద్ద మృతి చెందిన వ్యక్తిని నందిగామ కమలాకరరావుగా గుర్తించారు. నాగాయలంకకు చెందిన కమలాకరరావు(60) చల్లపల్లి మండల పరిధిలోని పురిటిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.
పోలీసుల అదుపులో కారు నడిపిన వ్యక్తి..
కారు నడిపిన వ్యక్తి వైశ్యబజారులో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న కె.శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ శ్రీనివాసరావుకు గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును నడిపిన వ్యక్తికి సరిగా డ్రైవింగ్ చేతకాకకపోవటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా ఉన్న మండపాన్ని ఢీ కొని కారు ఆగిందని.. లేకుంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువ ఉండేది.
చల్లపల్లిలో కారు బీభత్సం


